కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావురా అని వెనకటికి ఒకడిని అడిగితే… దూడ గడ్డి కోసం అన్నాడట! ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకే జవాబు చెప్పాలి. అంతేగానీ, పొంతన లేని సమాధానాలు చెబితే వినేవాళ్లకి ఎలా ఉంటుంది..? ప్రస్తుతం తెలుగుదేశం నేతలు మాటలు ఇలానే ఉంటున్నాయి. భూ కేటాయింపుల కమిటీలో రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తికి ఎందుకు చోటివ్వలేదు…? ఈ సూటి ప్రశ్న గడచిన రెండ్రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పలువురు మంత్రులతో నియమితమైన ఈ కమిటీలో సీఎం కుమారుడు నారా లోకేష్ కి కూడా చోటిచ్చారు. కానీ, భూ కేటాయింపుల విషయంలో నిర్ణయాలు తీసుకునే రెవెన్యూ శాఖామాత్యునికే ఎందుకుప్రాధాన్యం దక్కలేదు అనే అంశంపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ఇప్పుడు స్పందిస్తున్నారు.
ఇంతకీ, కె.ఇ.కి కమిటీలో ఎందుకు సభ్యత్వం దక్కలేదంటే… స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని, ప్రజాసేవ కోసం లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారనీ, ఆయనకి భూకేటాయింపుల కమిటీలో ప్రాధాన్యత ఇస్తే తప్పేముందని ఎదురు ప్రశ్నించారు టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్! సరే.. ఈయనే ఇలా అనుకుంటే మరో మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇదే అంశమై స్పందించారు. ఆ కమిటీలో కె.ఇ.ని ఎందుకు నియమించలేదంటే… మంత్రి వర్గ సభ్యుడిగా సంబంధిత కమిటీలన్నింటిలోనూ ఉండే అర్హత నారా లోకేష్ కు ఉంటుందనీ, రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయనీ, వాటికి సంబంధించిన భూకేటాయింపులు లోకేష్ దగ్గరుండి చూసుకుంటే బాగుంటుందని కమిటీలో సభ్యత్వం కల్పించారన్నారు!
సరే, ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కూడా స్పందించారు. ఆయనేమన్నారంటే.. ఆ కమిటీలో సీనియర్ మంత్రుల్ని నియమించాలన్న నిబంధన ఏదైనా ఉందా..? కమిటీలో ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు బీసీ కాదా.. అంటూ ఆయనా స్పందించారు! సో.. తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తున్నారో చెప్పడానికి ఈ మూడు స్పందనలూ చాలు.
కానీ, ఈ క్రమంలో అసలు విషయంపై ఎవ్వరూ మాట్లాడం లేదు! ఇంతకీ, ఆ కమిటీలో రెవెన్యూ మంత్రి కె.ఇ. కృష్ణమూర్తికి ఎందుకు స్థానం కల్పించలేదనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం లేదు. కె.ఇ. గురించి అడిగితే లోకేష్ అర్హతల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు అమెరికా వెళ్తూ టీడీపీ నేతలకు ఇదే టార్గెట్ ఇచ్చినట్టున్నారు. తాను తిరిగి వచ్చేలోపు భూకేటాయింపుల కమిటీలో లోకేష్ నియామకం అవసరం అనేది ఎస్టాబ్లిష్ చేయమని చెప్పినట్టున్నారు! కానీ, కె.ఇ. గురించి టీడీపీలో ఎవరు మాట్లాడతారు..?