మిర్చి రైతుల కష్టాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించిన సంగతి తెలిసిందే. రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలంటూ రెండు రాష్ట్రాల రైతుల తరఫున పవన్ ప్రశ్నించారు. (అదేలెండి… ట్విట్టర్ ద్వారానే!) తరువాత, కేంద్రం స్పందించి కంటితుడుపు చర్యగా కొంత మద్దతు ధర ప్రకటించింది. ఈ స్పందనపై కూడా జనసేన తాజాగా ప్రతిస్పందించింది. ‘మిర్చి కొనుగోలులో వివక్ష వద్దు’ అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి జనసేనాని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
దాన్లో కంటెంట్ ఏంటయ్యా అంటే… ‘పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇచ్చేందుకు ముందుడే సర్కారు, రైతుల పంటల మద్దతు ధర విషయానికి వచ్చేసరికి ఎందుకింత వివక్ష చూపుతున్నారు..? ఆంధ్రాలో 88,300 మెట్రిక్ టన్నులు కొంటున్న ప్రభుత్వం, తెలంగాణలో మాత్రం 33,700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తోంది. ఇది ఎంత వరకూ సబబు..? రెండు రాష్ట్రాలనూ సమానంగా చూడండి. తెలుగు రాష్ట్రాల మధ్య తగువులు పెట్టొద్దని జనసేన కోరుకుంటోంది’. ఇదీ పవన్ కల్యాణ్ తాజా ఆవేదన!
దీనిపై కామెంట్ ఏంటయ్యా అంటే.. రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం గురించి పవన్ ఎందుకు మాట్లాడ లేదు? ఆంధ్రా సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ఎందుకు పెన్ను రాలేదు..? అది స్నేహ ధర్మం అనుకుందాం. పోనీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా విమర్శించింది లేదే! సరే, మిర్చీ రైతుల కష్టాలకు కరిగిపోయిన పవన్, వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నారు అని కాసేపు అనుకుందాం. అప్పుడు కేంద్రాన్ని ఇంకోలా ప్రశ్నించాలి కదా. మిర్చీ రైతులకు రూ. 5 వేలు చాలదు, ఓ పదివేలు ప్రకటించండీ మోడీ సాబ్ అని నిలదీయాలి. ఈ అర్థం లేని మెట్రిక్ టన్నుల లెక్కల జోలికి పోకుండా… తెలుగు రాష్ట్రాల్లో పండుతున్న పంటను పూర్తిగా కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చెయ్యాలి. అంతేగానీ… ఆంధ్రాలో చటాక్ కొనుగోలు చేస్తే, తెలంగాణలో అంతే కొనాలని అనడమేంటో..? పైగా, తెలుగు రాష్ట్రాల గొడవలు పెట్టొద్దనడం బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యగా వినిపించడం లేదా!
తెలుగు ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారు. ఆ శక్తి పవన్ కళ్యాణ్ లో ఉందని అప్పుడప్పడూ అనిపిస్తున్నా… ఇలాంటి అపరిపక్వ స్పందనలూ, గందరగోళ ప్రకటనలూ చూస్తుంటే… ఒక చారిత్రక అవకాశాన్ని చేజేతులా జనసేనాని వదులుకుంటున్నారేమో అనే ఆందోళన కలగక మానదు. కేవలం ట్విట్టర్ ద్వారానే రాజకీయ పార్టీని నడపడం పవన్ సామర్థ్యం మాత్రమే కాదు… ఆయన ఏ మాధ్యమంలో స్పందించినా రిసీవ్ చేసుకుంటున్న ప్రజల గొప్పతనం కూడా గుర్తించాలి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జనసేనానిది. ఇలాంటి గందరగోళ స్పందనల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది!