పద్ధతైన యాంకరింగ్‌కి కేరాఫ్ అడ్రస్ సుమ. తెలుగులో యాంకర్లు తెగ రెచ్చిపోతుంటారు. ఒక్కోసారి ఏం మాట్లడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. చాలాసార్లు డబుల్ మీనింగ్ డైలాగుల్ని ఆశ్రయిస్తుంటారు. సుమ అయితే ఆ పరిస్థితి తీసుకురానివ్వదు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో సుమకు బాగా తెలుసు. హుషారు, చమత్కారం, సమయస్ఫూర్తి ఇవన్నీ సుమ ఆభరణాలు. అఇయతే ఈమధ్య సుమ కూడా.. నోరు జారుతోంది. అప్పుడప్పుడూ అక్కడక్కడా శ్రుతిమించుతోంది. సుమ వల్ల కథానాయిక మిస్తీ చక్రవర్తి.. కాస్త నొచ్చుకొంది. ఇదేం యాంకరింగ్ అంటూ బాధ పడిపోయిందట.
బాబు బాగా బిజీలో ఓ కథానాయికగా నటించింది మిస్తీ చక్రవర్తి. ఇటీవల బాబు బాగా బిజీ టీమ్ ఓ టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా మిస్తీ చక్రవర్తిని సుమ పరిచయం చేస్తూ.. ‘మీ పేరు ముష్టి చక్రవర్తినా మిస్తీ చక్రవర్తినా’ అని ఎటకారంగా అడిగింది. మిస్తీకి తెలుగు అంతగా రాదు. సుమ ఏం మాట్లాడిందో తనకి అర్థం కాలేదు. మిగిలిన టీమ్ కూడా.. సుమ అలా అనేసరికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదట. చివరికి సుమ ఏం అన్నదో.. అవసరాల శ్రీనివాస్ నుంచి అడిగి తెలుసుకొందట మిస్తీ. సుమ మాటలు అర్థమై.. చాలా ఫీలైందట. అసలే సినిమా పోయిన బాధలో ఉన్న మిస్తీ చక్రవర్తిని సుమ తన యాంకరింగ్‌తో మరింత బాధ పెట్టినట్టైంది. ఏంటి సుమ నువ్వు కూడా..!