తెలుగు సినిమా పరిశ్రమ ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇప్పటి వరకూ కలెక్షన్లలో బాలీవుడ్ సినిమాలు లక్ష్యంగా ఉండేవి. దీనికి టాలీవుడ్ కొత్త అర్థాన్ని చెప్పింది. బాహుబలి ది కన్‌క్లూషన్ ప్రపంచ సినిమా పరిశ్రమ అసూయపడేలా రికార్డులు సృష్టిస్తోంది. వెయ్యి కోట్ల రూపాయల రాబట్టింది. భారత్‌లో 800 కోట్లు, విదేశాలలో 200 కోట్లను కలెక్ట్ చేసిన రాజమౌళి మాయ 2000 కోట్ల రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదు. 15 రోజుల కూడా పూర్తికాకుండానే వెయ్యి కోట్ల మార్కును చేరడం బాహుబలి ఆకర్షణను తెలియజెపుతోంది. గతంలో అత్యధిక వసూళ్ల రికార్డు అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ పేరిట ఉండేది. ఆ సినిమా రూ.800 కోట్ల దాకా వసూళ్లు సాధించింది. షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్లు హీరోలుగా నటించిన సినిమాలు ఈ స్థాయికి చేరేవి. ఇప్పుడు ఆ వంతు ప్రభాస్‌కు వచ్చింది. ఓ తెలుగు హీరో ఇంతటి ఘనతను సాధిస్తాడని కలలో కూడా ఊహించలేదెవరు. ఈ ప్రతిష్టకు కారణం రాజమౌళి బృందానిదే. మొత్తం ఐదేళ్ళ పాటు పక్కకు కూడా తిరిగి చూడకుండా వారు చేసిన కృషికి ఫలితమిది.
పైరసీని నిరోధించేందుకు చిత్ర నిర్మాతలు రెండు టీవీ చానెళ్ళతో కలిసి, చేస్తున్న కృషి ఫలించడం కూడా ఇందుకు కారణం. షూటింగులకూ, పర్యాటకానికీ స్వర్గధామమైన హైదరాబాద్‌లోని ఓ సంస్థలో బాహుబలి 2 షూటింగును ఉచితంగా చేసుకునేందుకు అనుమతించిందనీ, తద్వారా వంద కోట్ల రూపాయల షేర్‌ను దానికి దఖలు పరిచారనీ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ సంస్థ నడుపుతున్న ఓ చానెల్‌తో పాటు, మరో చానెల్ కూడా బాహుబలి 2 పైరసీ సీడీలపై పహారా కాసి మరీ, పోలీసులకు పట్టించాయి.
ప్రతిష్టాత్మకమైన రికార్డులను సొంతం చేసుకున్న ఇంకా తన విజయయాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తున్న బాహుబలిని అందుకోవడం ఓ భారతీయ సినిమాకు ఇప్పట్లో అసాధ్యం. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి చిత్రాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసిన ప్రజలు మళ్ళీ బాహుబలి 2 ఎప్పుడు విడుదలవుతుందా అని వేచి చూశారు. ఇది కూడా ఈ చిత్రానికి దక్కిన ఫలితం.
Subrahmanyam vs Kuchimanchi