విశాఖ, అమరావతి నగరాలు ఐటీ శోభను సంతరించుకోనున్నాయి. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు డాలస్‌ను సందర్శించినప్పుడు ఈ అంశంపై స్పష్టత వచ్చింది. నాన్ రెసిడెంట్ తెలుగు పారిశ్రామికవేత్తల అమెరికాలో నిర్వహిస్తున్న 28 ఐటీ సంస్థలు ఆంధ్ర ప్రదేశ్‌లో తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చంద్రబాబుకు తెలియజేశారు. లీజు ప్రాతిపదికన స్థలాలను కేటాయిస్తే చాలుననీ, తమ కార్యకలాపాలను ప్రారంభిస్తామనీ కూడా వారు తెలిపారు. ప్రిమియర్, గ్లోబల్ ఔట్‌లుక్, టెక్‌ప్రోస్ సాఫ్ట్‌వేర్, ఆర్కస్‌టెక్, శ్రీ టెక్, మద్ది సాఫ్ట్, గురూస్ ఇన్ఫోటెక్, ఏఈ ఇన్ఫోటెక్, ఆక్టస్ తదితర సంస్థల ప్రతినిధులు ఇందుకు ముందుకొచ్చారు. వీటి ఏర్పాటుతో ప్రాథమికంగా విశాఖలో 310, అమరావతి 64మందికి ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు.
ఇలా ముందుకొచ్చిన వారంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. సాంకేతిక విద్యను అభ్యసించి, అమెరికా తరలివెళ్ళి నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకున్నారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్, స్మార్ట్ ఏపీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 30 మాత్రమే ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలను 300కు పెంచిన ఫలితం ఇప్పుడు ఆంధ్రకు వరంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు డలాస్‌లో వారితో మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తంచేశారు. మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చూస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది……..మీరు మరింత ఎదగాలంటూ ఆకాంక్షించారు. వృత్తనిపుణులుగా వచ్చి, పారిశ్రామికవేత్తలుగా ఎదగడం మీలోని పట్టుదలను సూచిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో భారతీయులు,ముఖ్యంగా తెలుగు వారు అభివృద్ధి చెందాలనేదే తన కలని పేర్కొన్నారు.
అమరావతికి డెల్..
డెల్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ సత్య కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అమరావతి, లేదా రాష్ట్రంలో మరే ప్రాంతంలోనైనా డేటా సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తంచేశారు. ఏపీలో మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు బెల్ హెలికాఫ్టర్ కంపెనీ డైరెక్టర్ చాడ్ స్పార్క్స్ ముఖ్యమంత్రికి చెప్పారు. పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఏవియేషన్ పాలసీని ఇప్పటికే తీసుకొచ్చామని తెలియజేసిన ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి వచ్చి అధికారులతో సంప్రదించాల్సిందిగా చంద్రబాబు ఆయనకు సూచించారు. తొలుత డాలస్ నగరంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి