‘నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తాం’… ఎప్పుడో మూడేళ్ల కిందట ఎన్నికలప్పుడు ఇదే మాట చెప్పారు! ఆ తరువాత, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడూ ఇదే చెప్పారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఇదే చెప్పారు. శంకుస్థాపన సమయంలో ఇదే చెప్పారు. విదేశాలకు పర్యటనకు వెళ్తున్నప్పుడూ ఇదే చెబుతున్నారు. ఆ మధ్య దావోస్ కి వెళ్లొచ్చాక ఇదే అన్నారు! ఇప్పుడు అమెరికా పర్యటనలో కూడా అదే మాట మీద నిలబడుతున్నారు!
ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల జాబితాలో అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో భాగంగా చెప్పారు. అక్కడ కొంతమంది ప్రవాస భారతీయ సీయీవోలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి విశిష్ఠతను వివరించారు. అమరావతి రాజధానిగా నిర్మించడం తమకు ఒక గొప్ప అవకాశం అన్నారు. తన పిలుపునకు స్పందించి… ఎంతో దీర్ఘదృష్టితో ఆలోచించిన రైతులు 33 వేల ఎకరాల భూముల్ని ఇచ్చేశారన్నారు. ఏపీ ప్రజలకు తనపై అంత నమ్మకం ఉందనీ, మీరు కూడా అంతే నమ్మకంతో ఆంధ్రా అభివృద్ధికి చేయూత ఇవ్వండీ అంటూ సీయీవోలను కోరారు. అంతేకాదు, మరో దశాబ్దన్నర పాటు ఆంధ్రా వృద్ధి రేటు 15 ఉంటుందని చెప్పారు.
అమరావతి నగరం నిర్మించడం చంద్రబాబుకు దక్కిన అవకాశమే! కానీ, ఇంకా ఎన్నాళ్లీ అవకాశం. మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నారు. నిధుల్లేకపోయినా గుండె నిబ్బరం ఉంది అంటున్నారు. నిబ్బరంతోనే నిర్మాణాలు జరిగిపోతాయా..? గడచిన మూడేళ్లలో అమరావతి గురించి చేసిందేముందీ.. అంటే, పునాదిరాళ్లు తప్ప ఏదీ జరగలేదు. అమరావతిలో ఎలాంటి భవనాలు కట్టాలో ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఆ మధ్య జపాన్ కి చెందిన మాకీ కంపెనీతో డిజైన్లు చేయించారు. అవి బాలేవంటూ ఆ కంపెనీని తప్పించి, ఇంకో కంపెనీతో నమూనాలు వేయించుకున్నారు. పోనీ, వాటినైనా ఫైనల్ చేశారంటే… అదీ లేదు. అవీ కాస్త తేడాగానే ఉన్నట్టు ఇటీవలే మంత్రి నారాయణ నీళ్లు నములుతూ చెప్పిన సంగతి తెలిసిందే.
నిజమే, అమరావతి లాంటి నగరం నిర్మించాలంటే సుదీర్ఘమైన పనే. ఎంతో మేథోమధనం అవసరం. కానీ, మూడేళ్లుగా డిజైన్లనే ఫైనల్ చేయలేకపోయారు. మరో ఏడాదిన్నరలో ముందస్తు ఎన్నికలంటూ ఆ మధ్య సంకేతాలిచ్చారు. అంటే, ఈ టెర్మ్ కి అమరావతి ఇంతేనా అనేది సామాన్యుడి అనుమానం. కనీసం… మౌలిక సదుపాయాలపై దృష్టినా బాగుండేది. నిజానికి, మహా నగరాలను నిర్మించడం సాధ్యమా..? నగరాలు మహానగరాలు కావాలంటే ప్రైవేటు సంస్థలు రావాలి. విదేశీ సంస్థలు రావాలి. ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి. అనుబంధంగా ఇతర చిన్న తరహా వ్యాపార వాణిజ్యాలు పెరగాలి. ఇవన్నీ ప్లాన్ చేస్తే జరిగేవి కావు కదా! టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటే వచ్చేవి కావు. అందుకే, ముందుగా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. వాటి గురించి కూడా మాట్లాడకుండా… ‘అమరావతి నిర్మాణం మాకో అవకాశం’ అని ఇంకెన్నాళ్లు చెబుతారు..? ఇంకెన్ని దేశాల్లో ఇదే మాటకు చాటింపేస్తారు..?