1990 దశకంలో దేశాన్ని సంచలనంతో పట్టి కుదిపేసిన పశుగ్రాసం కుంభకోణంపై అత్యున్నత న్యాయ స్థానం సోమవారం నాడు తీర్పు చెప్పబోతోంది. బీహార్‌లోని పశుసంవర్థక శాఖ విభాగంలో గ్రాసానికి సంబంధించిన వెయ్యి కోట్ల కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రీ, రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడూ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన నిందితుడు. దీనివల్లే ఆయన పదవి నుంచి దిగిపోయి, భార్య రబ్డీ దేవిని సీఎం పీఠంపై కూర్చోపెట్టాల్సి వచ్చింది. ఏప్రిల్ 20న తుది విచారణ ముగిసిన అనంతరం తీర్పును రిజర్వులో ఉంచింది. వారంలోగా నిందితులందరూ తమ తమ అభిప్రాయాలను ఇవ్వాలని కోరింది. తనకు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ లాలూ కూడా పిటిషన్ ఫైల్ చేశారు. దానిని కూడా సుప్రీం పరిగణనలోకి తీసుకుంది. లాలూపై ఒక కేసును జార్ఖండ్ హైకోర్టు ఉపసంహరించుకోవడాన్ని సీబీఐ సవాలు చేసింది. ఒకే కేసులో ఒకే వ్యక్తిని రెండుసార్లు విచారించకూడదన్న నిబంధనను అనుసరించి, ఒక కేసును సీబీఐ ఉపసంహరించుకుంది. ఐపీసీ 201 (సాక్ష్యాలను అదృశ్యం చేసిన నేరం) కింద లాలూ విచారణను కొనసాగించవచ్చని సుప్రీం ఆదేశించింది. యావజ్జీవ ఖైదు లేదా జైలు శిక్షకు అర్హమైన నేరం ఐపీసీ 511 కింద కూడా ఆయన్ను విచారించవచ్చని పేర్కొంది.
అధికారంలో ఉన్న బీజేపీ అవినీతి కేసులను అస్సలు సహించడం లేదు. శశికళ, దినకరన్‌ల కేసులు దీనికి సాక్ష్యం. ప్రభుత్వ వైఖరి కఠినంగా ఉండటంతో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. రప్పించడం అసాధ్యమనుకున్న విజయ్ మాల్యాను ఇండియాకు తీసుకురావడానికి వీలుగా కేంద్రం బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే క్రికెట్ టీమ్‌తో సమానంగా సంతానాన్ని కన్న లాలూ ప్రసాద్‌యాదవ్‌కు కష్ట కాలం తప్పేలా కనిపించడం లేదు. ఖైదా.. విముక్తా అన్నది కొద్ది గంటల్లో తేలిపోతుంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి