కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారు! చేస్తున్నారంటే చేస్తున్నారు, లేదంటే లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏ అమావాస్యకో పున్నానికో ఆయనకు ఉద్యమం గుర్తొస్తుంది, కార్యాచరణ మొదలు అంటారు. వెనక్కి తగ్గేదే లేదంటారు. ఇచ్చిన హామీ చంద్రబాబు నెరవేర్చే వరకూ నిద్రపోనంటారు. పోరాటం కొనసాగుతుందని బల్ల గుద్ది చెబుతారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ప్రతిపక్ష నేతలతో సహా కొంతమంది కాపు ఉద్యమ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కారు ఓ తీర్మానం చేయాలన్నారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపుల రిజర్వేషన్లు సాధించే వరకూ తన పోరాటం కొనసాగిస్తానని ముద్రగడ పునరుద్ఘాటించారు. సీఎం హామీలు నెరవేర్చే వరకూ తాను నిద్రపోనని అన్నారు. త్వరలో మరో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.
ఇంతకీ… కాపుల రిజర్వేషన్ల ఉద్యమం ఇప్పుడు ఎక్కడున్నట్టు..? గడిచిన కొన్నాళ్లుగా ముద్రగడ చేస్తున్న పోరాటం ఏ మజిలీ వరకూ వచ్చినట్టు..? ఇంకెంత దూరంలో లక్ష్యం ఉన్నట్టు..? తాను నడుపుతున్న ఉద్యమం తీరుపై ముద్రగడ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఎప్పుడో తుని దగ్గర జరిగిన సభలో కాపు ఉద్యమం తీవ్రతరమైందన్న సంకేతాలు కనిపించాయి. ఆ తరువాతి నుంచి ముద్రగడ పోరాటం రొటీన్ అయిపోయిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆయన పాదయాత్ర అనడం… కిర్లంపూడికి పోలీసులు రావడం… ముద్రగడ గృహనిర్బంధం… రాజమండ్రికి తరలింపు… రెండూమూడు రోజుల హైడ్రామా! ఆ తరువాత, ఉద్యమం కోసం ముద్రగడ ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలీదు.
ఉద్యమ నేత ముద్రగడ ఆ మధ్య వరుసగా కొంతమంది ప్రముఖులను కలుసుకున్నారు. దాసరి నారాయణరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటివారితోపాటు పలువురితో భేటీ అయ్యారు. ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నార్లే అనుకుంటే… ఆ మీటింగుల అనంతరం ఎలాంటి కదిలికా లేకుండా పోయింది. ఇక, కాపు సామాజిక వర్గం నుంచైనా ఉద్యమం ముందుకు కదిలిందా.. అంటే, ఆ దిశగా కూడా ముద్రగడ కృషి పెద్దగా కనిపించడం లేదనే చెప్పాలి. కాపుల సామాజిక వెనుకబాటు తనాన్ని సమర్థంగా సమాజానికి చూపించలేకపోతున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, రాజకీయం… ఇలా అన్ని రంగాల్లో కాపుల వెనుకబాటుతనాన్ని ప్రజావేదికలపై ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. కాపులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను చూపించలేకపోతున్నారు.
నిజానికి, ఏదైనా ఒక కులాన్ని బీసీల్లో చేర్చాలంటే… ఆ కులంలో ఉన్నవారు ఎదుర్కొంటున్న వివక్ష, అణచివేత ధోరణి, వెనకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇది రాజ్యాంగంలో ఉన్నదే. సో.. కాపులకు రిజర్వేషన్లు దక్కాలంటే ఉద్యమాన్ని ఈ దిశగా నడిపించాలి. కాపుల కష్టాల్ని ఎస్టాబ్లిష్ చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అయితే, ముద్రగడ నడుపుతున్న ఉద్యమం అటు కాపు నాయకుల నుంచీ తీవ్రతరం కావడం లేదు.. ఇటు ఆ సామాజిక వర్గం నుంచి కూడా బలమైన స్వరం వినిపించడం లేదు. లోపం ఎక్కడుందో ఇప్పటికైనా చెక్ చేసుకోకపోతే… ముద్రగడ పాదయాత్ర మరో న్యూస్ ఐటమ్ గానే మిగిలిపోతుంది!