కోస్తాతీరంలో ఎయిర్ పోర్టు, పోర్టుల నిర్మాణాలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలో మూడు భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. కృష్ణాజిల్లాలో బందరుపోర్టు నిర్మాణం కోసం 14 వేల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా లో భావనపాడు పోర్టు నిర్మాణానికి 5500 ఎకరాలు, విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డు ఎయిర్ పోర్టుకి 5300 ఎరాలు భూమిని సేకరిస్తారు. బందరు పోర్టుకి ఉద్దేశించిన 30 వేల ఎకరాల్లో 16 వేల ఎకరాల బంజర్లు, ఎసైన్మెంట్ తరహాల ప్రభుత్వ భూములు వున్నాయి. వాటికి తరతరాలుగా సాగుచేసుకుంటున్న వారికి పరిహారం ఇచ్చే అవకాశం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
రాజధాని అమరావతి నిర్మాణానికి భూమిని లాండ్ పూలింగ్ ద్వారా సమకూర్చుకున్న రాష్ట్రప్రభుత్వ విధానం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకి దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ఒకేసారి పరిహారం ఇచ్చి భూమినుంచి రైతుని నిర్భంధంగా వేరు చేసే లాండ్ అక్విజేషన్ కంటే, లాండ్ పూలింగ్ లో సేకరించిన భూమి ప్రయోజనం మారి రాబడులు పెరుగుతున్నకొద్దీ అందులో భాగంకూడా రైతుకి అందేలా చూసే ”ఇన్ క్లూజివ్ డెవలప్ మెంటు” విధానంలోని మానవీయకోణం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకర్షించింది.
జాతీయ రహదారుల విస్తరణలో 35 నుంచి 40 శాతం పనులు పెండింగ్ లో వుండిపోడానికి కారణం ఆయా భూములపై కోర్టుల్లో వుండిపోయిన లిటిగేషన్లే. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చే భూమిని, ఉద్దేశించిన ప్రయోజనాలకోసం అభివృద్ధి చేశాక అందులో కొంతభాగం రైతుకే ఇచ్చే పూలింగ్ విధానాన్ని రోడ్ల విస్తరణలో కూడా వర్తింపచేయాలని ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు సూచించింది. రహదారికి అక్కడక్కడా విశాలమైన స్ధలాలు సేకరించి లేదా సమీకరించి, వాణిజ్య సముదాయాలు నిర్నించి, రహదారులకు ఇరువైపులా స్ధలాలు ఇచ్చిన రైతులకు ఆ సముదాయాల్లో యాజమాన్యం ఇవ్వవచ్చన్నది ఆ నోట్ సారాంశం. మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్విధికారులు కూడా లాండ్ పూలింగ్ పట్ల వివరాలు తెలుసుకున్నారు.
రాజధానికి భూములు ఇవ్వడానికి మూడువేల ఎకరాల రైతులు ఎదురుతిరిగినపుడు నిర్భందపు లాండ్ ఆక్విజేషన్ ద్వారా భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం సిద్దమైంది.జనసేన అధ్యక్షుడు పనన్ కల్యాణ్ జోక్యంతో ప్రభుత్వం దారిమార్చుకుని లాండ్ పూలింగ్ ద్వారానే భూసమీకరణ చేయాలని నిర్ణయించింది.
లోపలా బయటా కూడా చంద్రబాబుకి పేరు ప్రతిష్టల్ని తెచ్చి పెట్టిన ‘ఇన్ క్లూజివ్ డెవలప్ మెంటు” కాన్సెప్టు ద్వారా లాండ్ పూలింగ్ ని విడిచిపెట్టి సాంప్రదాయికమైన లాండ్ అక్విజేషన్ నోటీసులనే ఎయిర్ పోర్టు, పోర్టుల భూములకోసం రాష్ట్రప్రభుత్వం జారీచేయడం విశేషం. భవిష్యత్ అవసరాలకోసం వేర్వేరు చోట్ల మొత్తం 15 లక్షల ఎకరాల తో లాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం తలపెట్టింది. ఆభూములను కూడా నిర్భందంగానే సేకరించబోతున్నారనడానికి, వారం వ్యవధిలో వెలువడిన మూడు లాండ్ అక్విజేషన్ నోటిఫికేషన్లే ఒక సూచిక! ఆదర్శవంతంగా కనిపిస్తున్న లాండ్ పూలింగ్ ప్రయోగంలో రాష్ట్రప్రభుత్వానికి కాళ్ళు లాగేశాయనడానికి కూడా ఈ మూడు నోటిఫికేషన్లే సాక్ష్యం!!