బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు పంచ్ పడింది. జార్ఖండ్ హైకోర్టు లాలూపై కేసును ఉపసంహరించుకోవడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను ప్రత్యేకంగా విచారించాలని ఆదేశించింది. 1990 దశకంలో దేశాన్ని పట్టి కుదిపేసిన పశుగ్రాసం కుంభకోణంపై సుప్రీం కోర్టు సోమవారం నాడు తీర్పు చెప్పింది. బీహార్‌లోని పశుసంవర్థక శాఖ విభాగంలో గ్రాసానికి సంబంధించిన వెయ్యి కోట్ల కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రీ, రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడూ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన నిందితుడు. దీనివల్లే ఆయన పదవి నుంచి దిగిపోయి, భార్య రబ్డీ దేవిని సీఎం పీఠంపై కూర్చోపెట్టాల్సి వచ్చింది. ఏప్రిల్ 20న తుది విచారణ ముగిసిన అనంతరం తీర్పును రిజర్వులో ఉంచింది. వారంలోగా నిందితులందరూ తమ తమ అభిప్రాయాలను ఇవ్వాలని కోరింది. తనకు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ లాలూ కూడా పిటిషన్ ఫైల్ చేశారు. దానిని కూడా సుప్రీం పరిగణనలోకి తీసుకుంది. లాలూపై ఒక కేసును జార్ఖండ్ హైకోర్టు ఉపసంహరించుకోవడాన్ని సీబీఐ సవాలు చేసింది. ఒకే కేసులో ఒకే వ్యక్తిని రెండుసార్లు విచారించకూడదన్న నిబంధనను అనుసరించి, ఒక కేసును సీబీఐ ఉపసంహరించుకుంది. ఐపీసీ 201 (సాక్ష్యాలను అదృశ్యం చేసిన నేరం) కింద లాలూ విచారణను కొనసాగించవచ్చని సుప్రీం ఆదేశించింది. యావజ్జీవ ఖైదు లేదా జైలు శిక్షకు అర్హమైన నేరం ఐపీసీ 511 కింద కూడా ఆయన్ను విచారించవచ్చని పేర్కొంది. తాజా తీర్పు కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు తిప్పలుతప్పకపోవచ్చు. అవినీతి కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి ఈ తీర్పు అద్దం పట్టింది. అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతామని ఎన్డీఏ ప్రభుత్వం గతంలోనే చెప్పింది.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి