డాన్స్ మాస్టర్లు డైరెక్టర్లుగా మారడం చూస్తూనే ఉన్నాం. ప్రభుదేవా, లారెన్స్ లు దర్శకులుగానూ రాణించారు. ఫైట్ మాస్టర్లు మెగా ఫోన్ పట్టుకోవడం అరుదైన విషయమే. అయితే.. ఇప్పుడు పీటర్ హెయిన్స్ ఆ ఫీట్ చేయబోతున్నాడు. దక్షిణాదిన మోస్ట్ టాలెంటెడ్ ఫైట్ మాస్టర్‌గా పేరు తెచ్చుకొన్నాడు పీటర్ హెయిన్స్. మగధీర, సెవెన్త్ సెన్స్, రోబో, బాహుబలి 1 చిత్రాలకు పీటర్ ఫైట్స్ అందించాడు. ఎప్పటి నుంచో పీటర్‌కు డైరక్షన్ చేయాలని ఆశ. ఇప్పుడు ఆ కలని సాకారం చేసుకొనే పనిలో ఉన్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడట పీటర్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మోహన్ లాల్ చిత్రం ‘మన్యం పులి’ కీ పీటర్ ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఆసినిమాలోని పులితో చేసే పోరాట దృశ్యాలు అబ్బుర పరుస్తాయి. ‘మన్యం పులి’ సమయంలోనే… మోహన్ లాల్‌కి కథ చెప్పేశాడట పీటర్. ఆ కథ నచ్చడంతో మోహన్ లాల్ ‘ఓకే’ అనేశాడట. ఫైట్ మాస్టర్ తీస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా నిండా పోరాట ఘట్టాలే ఉన్నాయనుకోకండి. ఇదో ఫీల్ గుడ్ స్టోరీ అట. సరికొత్త నేపథ్యంలో సాగే సినిమా అనీ.. ఫైట్స్‌కి అవకాశమే లేదని తెలుస్తోంది.