గబ్బర్‌సింగ్ సినిమాలో తనకు తోచినట్టుగా ఒక్కో సందర్భంలో ఒక్కో డైలాగ్ పేలుస్తూ ఉంటాడు పవన్. ఆ తర్వాత ఆ డైలాగ్స్ అన్నీ కలిపి ఓ బుక్ వేయిస్తానంటాడు. ఆ బుక్కి ‘నేను…నా పైత్యం’ అన్న టైటిల్ పెట్టేస్తానంటాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే తరహాలో ముందుకు పోతున్నాడు పవన్. పవన్ పిలుపు మేరకు(?) చంద్రబాబు, మోడీలకు ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాల గురించి కనీస మాత్రంగా కూడా పట్టించునే తీరిక పవన్‌కి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో పవన్‌కి తెలుసు. గ్రామాలన్నీ ఖాళీ అవుతున్న విషయం కూడా తెలుసు. నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా గాలికి వదిలేసిన విషయం తెలుసు. రైతులను, గ్రామాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్న విషయం కూడా తెలుసు. ప్రజలకు ఇప్పటికిప్పుడు అవసరమైన ఏ ఒక్క సమస్యపైన అయినా స్పందించాలన్న స్పృహ పవన్‌కి లేకుండా పోతోంది. ఏం చేసినా ఎక్కడ చంద్రబాబుకు మైనస్ అవుతుందో అనే ఉద్ధేశ్యంతోనే పవన్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడన్న ప్రత్యర్థుల విమర్శలు నిజం చేస్తూ తన మానానా తాను మాత్రం ఉత్తర-దక్షిణ భారతదేశాలంటూ లేని సమస్యను పట్టుకుని ఊగులాడుతున్నాడు పవన్.
టిటిడి ఈవోగా ఉత్తరాధి ఐఎఎస్ అధికారిని నియమించడంపై తాజాగా స్పందించాడు పవన్. అంటే చంద్రబాబును విమర్శించాడని అనుకునేరు. జనాలకు అలా అర్థమయ్యే అవకాశమే లేకుండా ఉత్తర-దక్షిణ అంశమే బాగా హైలైట్ అయ్యేలా తెలివిగా స్పందించాడు పవన్. ఉత్తరాధి అధికారిని ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణ భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పాలని పవన్ అడగడం అయితే పిచ్చ కామెడీగా ఉంది. ఉత్తరాది అధికారిని ఎందుకు నియమించారు అని అడిగిన దక్షిణాది ప్రజలు ఎవరో కూడా పవన్ చెప్పి ఉంటే బాగుండేది. తమిళులా, కన్నడిగులా…..లేక దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ పవన్‌లానే లేని సమస్యను పట్టుకుని ఊగులాడుతున్నారన్న భ్రమల్లో పవన్ ఉన్నాడా? కోటీశ్వరుడైన పవన్‌కి ఉత్తర-దక్షిణ భారతదేశం అనే రాజకీయ అంశం అవసరమేమోగానీ ప్రజలకు మాత్రం వాళ్ళ బ్రతుకుదెరువుకు సంబంధించిన సమస్యలపై స్పందించే నాయకుడు, ఆసరాగా నిలబడే నాయకుడు కావాలి. కానీ పవన్‌కి మాత్రం ప్రజల విషయాలు అస్సలు అవసరం లేదు. ‘పవన్….పవన్ పైత్యం’లో నుంచి పుట్టుకొచ్చే ఉత్తర-దక్షిణ లాంటి విషయాలతో కాలక్షేపం చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. పవన్ రాజకీయాలపై పవన్ భక్తులందరూ కూడా…….మా నాయకుడు నమ్మి ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాత్రమే ఆలోచించే నాయకుడు కాదు……దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ఉద్ధరించే నాయకుడు. చంద్రబాబు, కెసీఆర్, జగన్‌ల కంటే విశాల హృదయుడు అనే స్థాయిలో దేవుడు పవన్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవచ్చు కానీ పవన్ మాత్రం నమ్మి సపోర్ట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రోజు రోజుకూ దూరమవుతాడన్న విషయం మాత్రం సుస్ఫష్టం.