ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా టూర్‌పై వివాదాలు ముసురుకుంటున్నాయి. ఎవరో పెట్టారో తెలియని ఒక ఈమెయిల్ దీనికి కారణంగా నిలుస్తోంది. అమెరికా ప్రభుత్వానికి రాసిన ఈమెయిల్ నేపథ్యంలో డాలస్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటున్న కార్యక్రమానికి పోలీసులు వచ్చారనీ, అది ఉన్నత స్థాయి సమావేశమనీ తెలిసి, మరింత భద్రత పెంచారనీ, టీవీ 9 తెలుగు చానెల్ తెలుపుతోంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ ఈమెయిల్‌ను రాసిందని టీడీపీ ఆరోపిస్తుండగా.. తమకా అవసరం లేదని ప్రతిపక్షం ఘంటాపథంగా చెబుతోంది.
ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అమెరికాలో తెలుగు ప్రతిష్టను దెబ్బతీసే స్థాయికి చేరాయి. రెండు పార్టీలూ నువ్వంటే నువ్వంటూ దుమ్ము చల్లుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీల మధ్య కక్షలు ఖండాతరాలు దాటిపోయినట్లే కనిపిస్తోంది.
హుందాగా వ్యవహరించాల్సిన రాజకీయ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ నోరుమూసుకో..సిగ్గులేదా వంటి పదాలను వాడుతూ వాళ్ళకున్న గౌరవాన్ని చెడగొట్టుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా సవాళ్ళూ విసురుకుంటున్నారు. ఈ మెయిల్ వ్యవహారాన్ని చూసుకోవడానికి అమెరికా పోలీసులున్నారు. చట్టాలున్నాయి. ఆ అంశంపై పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ రోడ్డున పడిపోవడం దేనికి సంకేతం..? ఈమెయిల్ ఇచ్చిన వారెవరో తేల్చాలని అమెరికా పోలీసులను అక్కడి తెలుగు సంఘాలు అడిగితే.. సమస్య అదే పరిష్కారమవుతుంది. సైబర్ తరహా నేరాలను ఛేదించడంలో ఆ పోలీసులు దిట్టలు. ఇవన్నీ తెలుసుండీ.. సంబంధం లేని మాటలు మాట్టాడుతూ, రాజకీయంగా పైచేయి కోసం సమాజాన్ని మరింత విషతుల్యం చేస్తున్నారు.
ఏపీలో మీడియా కూడా పార్టీల వారీగా చీలిపోవడం దుష్పరిణామాలకు దారితీస్తోంది. టీడీపీకి ప్రత్యేకంగా మీడియా సంస్థ లేకపోయినప్పటికీ నాలుగు ప్రధాన టీవీ చానెళ్ళు ఆ పార్టీకి బహిరంగంగానే వంత పాడుతున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంతంగా చానెల్, పత్రిక కూడా ఉన్నాయి. అంతకు మించిన సోషల్ మీడియా బృంద బలంతో ఆ పార్టీ శ్రేణులు చెలరేగిపోతున్నాయి. ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్‌పై ఇటీవల వచ్చిన పోస్టింగుతో ఆ రెండు పార్టీల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. అక్కడినుంచి ఇప్పుడు ఖండాంతరం దాటి అమెరికా చేరింది. రాజకీయ మైలేజీ కోసం.. విలువల్ని వదులుకోకూడదు. వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. పదేళ్ళుగా ఈ వైఖరి చాలా పెరిగిపోయింది. ఇక్కడ విమర్శలు చేసుకుంటున్నది కాకుండా అమెరికాలో కూడా రచ్చకెక్కేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంట్లో గొడవలు ఇంటికే పరిమితమైనంత వరకూ పరవాలేదు. పరాయి దేశంలో ఇద్దరు తెలుగు వాళ్ళు కొట్టుకుంటే పరువు ఏమవుతుందో ఆలోచించుకోవాలి.
చంద్రబాబు 12 రోజుల అమెరికా పర్యటనకు పూనుకోవడం విమర్శలకూ దారితీస్తోంది. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని విడిచిపెట్టి పదిరోజులపైన వెడితే పరిపాలన ఏమవుతుందని ప్రశ్నించిన వారూ లేకపోలేదు. పెట్టబడులకు ముఖ్యమంత్రే వెళ్ళాల్సిన అవసరం లేదనీ, ముందు సంబంధిత శాఖమంత్రిని పంపి, పెట్టుబడులు రావడం నిర్థారణైతే ఓ రెండు రోజుల పాటు వెళ్ళితే సరిపోయేదనీ అంటున్నారు. ఇది ప్రజాధన దుర్వినియోగం తప్ప వేరొకటి కాదనేదీ కొందరి వాదన. అమరావతి పేరు చెప్పి లగ్జరీగా దేశాలు తిరుగుతున్నారనీ, మూడేళ్ళలో చంద్రబాబు 16సార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారనీ వైయస్ఆర్ కాంగ్రెస్ విమర్శ. వీటిని తెలుగుదేశం పార్టీ నేతలు ధీటుగానే తిప్పికొడుతున్నారు. ఏమైనప్పటికీ చంద్రబాబులాంటి రాజనీతిజ్ఞుడి ఇలాంటి విమర్శలకు తావు లేకుండా చూసుకుని ఉంటే బాగుండేది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి