ముప్పవరపు వెంకయ్యనాయుడు మాటకారితనంతో ఎంతటి వారినైనా ఆకర్షించగల నేత. కేంద్ర మంత్రి పదవిలో ఉన్న ఆయనకు ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి వరించింది. అంతర్జాతీయ వేదికపై తన వాణినీ, ప్రాసపూరిత ప్రసంగాలను వినిపించే అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి ఆవాస పాలకమండలి ఛైర్మన్గా వెంకయ్యనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కెన్యా రాజధాని నైరోబీలో నిర్వహించిన ఐక్య రాజ్య సమితి హ్యాబిటేట్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను ఎన్నుకుంది. ఈ కౌన్సిల్లో మొత్తం 58 దేశాల ప్రతినిధులు సభ్యులు. నాలుగు రోజులపాటు సాగే కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి వెంకయ్యనాయుడు అధ్యక్షత వహిస్తారు. ఈ కౌన్సిల్ 1978లో ఏర్పాటైంది. ఓ భారతీయుడు దీనికి ఛైర్మన్గా ఎన్నికవడం ఇది మూడో సారి. 1988, 2007 సంవత్సరాలో భారతీయులు ఛైర్మన్గా వ్యవహరించారు. పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన రంగాలలో వెంకయ్య నాయుడు చేసిన కృషి ఆయనకు ఈ పదవిని కట్టబెట్టింది. ఐరాస ఆవాస పాలక మండలి ఛైర్మన్ పదవికి ఆయన పేరును ప్రతిపాదించింది. ఇతర దేశాలు ఆయన పేరును ఆమోదించడంతో వెంకయ్య ఎన్నిక ఏకగ్రీవమైంది. రెండేళ్ల పాటు వెంకయ్య నాయుడు ఆ పదవిలో కొనసాగుతారు. రానున్న పదే సంవత్సరాల్లో నిరు పేద దేశాల్లోని పేదలకు నివాసాల కల్పనకు ఈ కౌన్సిల్ కృషి చేస్తుంది. అందుకు తగ్గ వ్యూహాలను రూపొందిస్తుంది. కార్యాచరణ ప్రణాళికనూ రూపొందిస్తుంది. అన్ని దేశాలూ దాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటుంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మినహా కనీస ఆవాసాలు లేని దేశాలు చాలనే ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఈ సమస్య అత్యంత ఎక్కువగా ఉంది. కొన్ని ఆసియా దేశాల్లోనూ దీని ప్రభావం ఉంది. ఇప్పటికీ కనీసం గుడిసెలు కూడా లేని వారు ఆఫ్రికా దేశాల్లో ఉన్నారు. ప్రత్యేకించి- వారిని లక్ష్యంగా చేసుకుని, అలాంటి దేశాలను దృష్టిలో ఉంచుకుని.. వారికి నిలువ నీడను కల్పించే అంశాలపై ఇందులో చర్చిస్తారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిగా తనకున్న అనుభవాన్ని వెంకయ్య ఐక్యరాజ్యసమితిలో రంగరించి, తగిన కృషి చేస్తారనీ, తద్వారా భారత్కు కీర్తి ప్రతిష్టలు తెస్తారనీ ఆశిద్దాం.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి