‘నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షా’ అన్నట్టుగా తండ్రి అడుగుజాడలను తు.చ. తప్పకుండా ఫాలో అయిపోతున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్! ఆంధ్రా ప్రజల కష్టాల గురించి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒకే కథ చెబుతూ ఉంటారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా సరే, ఇంకా అదే పాత కథ చెబుతూ ఉన్నారు. అదేనండీ… ఆంధ్రా ఆర్థిక కష్టాలు కథ. ఆంధ్రాని రోడ్డున పడేశారనీ, కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చేశామనీ… రాష్ట్రం తీవ్ర ఆర్థికలోటులో ఉన్నా సరే, ధైర్యంగా ముందుకు సాగుతున్నామనీ అదీ ఇదీ అనీ.. వగైరా వగైరా. ఇదే కథను మంత్రి నారా లోకేష్ కూడా బాగా బట్టీ పట్టేశారు. రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు రోజుకి 18 గంటలు శ్రమిస్తున్నారన్నారు. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చేశామని అన్నారు (ఈయన కూడానా!). రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడిందనీ, ఒక్కో సమస్యనీ అధిగమించుకుంటూ వస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నారని కూడా పన్లోపనిగా ఓ మాట అనేశారు!
కట్టుబట్టలతో ఆంధ్రాకి వచ్చేశామని నారా లోకేష్ చెబుతూ ఉండటం విడ్డూరంగా ఉంది! ఎందుకంటే, రాష్ట్ర విభజన తరువాత కట్టుబట్టలతో రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు..? పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉంది. అక్కడే ఉంటూ అమరావతి నిర్మాణం పూర్తి చెయ్యొచ్చు. సాధారణ పరిపాలన అందించొచ్చు. అన్ని సదుపాయాలూ సమూకూరిన తరువాత ఆంధ్రాకి రావొచ్చు. కానీ, ఓటుకు నోటు కేసు నేపథ్యంలో హుటాహుటిన సో కాల్డ్ కట్టుబట్టలతో ఆంధ్రాకి పాలనను అర్జెంటుగా మార్చింది ఎవరో లోకేష్ కి తెలీదా?
ఇంకో పడికట్టు పదం… ఆంధ్రా లోటు బడ్జెట్! లోటులో ఉన్నది ఆంధ్రా రాష్ట్రమేగానీ ఆంధ్రా ముఖ్యమంత్రి కాదు. ఎందుకంటే, దుబారాను ఆయన నియంత్రించిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా..? ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్తారు. కోట్లకు కోట్లు ఖర్చు చేస్తారు. ఇదే విషయమై కాగ్ మొట్టికాయలు వేసినా కామ్ గా ఉంటారు. నిజంగానే రాష్ట్ర ఆర్థికలోటుపై అంత బాధ్యతే ఉంటే దుబారా తగ్గించుకున్న దాఖలేవీ..? అంతెందుకు… తాత్కాలిక సచివాలయానికి మొదట్లో ఓ రూ. 3 వందల కోట్లు కట్టేద్దామనుకున్నారు. చివరికి అది పూర్తయ్యే సరికి దాదాపు రూ. 1 వెయ్యి కోట్లకు ఎందుకు చేరిందో, ఎలా చేర్చారో లోకేష్ కి తెలీదా..? లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం చేయాల్సిన ఖర్చులు ఇవేనా..?
రోజుకి 18 గంటలు కష్టపడటాన్ని నిజంగానే అప్రిషియేట్ చెయ్యాలి. కరెక్టే.. కానీ ఆ పనిగంటలకు తగిన ఫలితం ఎక్కడ కనిపిస్తోంది..? అమరావతి నిర్మాణం, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైతుల రుణమాఫీలు, డ్వాక్రా రుణ మాఫీలు, యువతకి ఉద్యోగాలు, ఎవ్వోయూలు దాటి బయటకి రాని పరిశ్రమలు… ఇలాంటివేవీ ఇంకా పూర్తిగా సాకారం కాలేదే! వాటి గురించి లోకేష్ మాట్లాడితే బాగుంటుందిగానీ.. ఇంకా కట్టుబట్టల కట్టుకథలు ఎన్నాళ్లు చెబుతారండీ. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి. ఇంకా భవిష్యత్తు భవిష్యత్తు అంటే… ఆ భవిష్యత్తు ఏదో ఒక రోజు మొదలు కావాలి కదా! ఏదైతేనేం, లోకేష్ కూడా కట్టుబట్టల కథను బాగానే కంఠతా పెట్టేశారని అర్థం చేసుకోవచ్చు!