తెలంగాణ సీఎం కేసీఆర్ తరువాత అత్యంత పాపులారిటీ కలిగిన నాయకుడు రేవంత్ రెడ్డి! అవునండీ… ఇదేదో రేవంత్ అనుకూల వర్గం చేస్తున్న ప్రచారం కాదు. కేసీఆర్ వ్యతిరేక వర్గం చేస్తున్న వ్యాఖ్యానం అంతకన్నా కాదు. తెలంగాణలో అత్యంత జనాదరణ గల కేసీఆర్ తరువాతి స్థానం.. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిదే. ఇంకో విశేషం ఏంటంటే… పాపులారిటీలో రేవంత్ కు సమీపంలో ఇతర నాయకులెవ్వరూ లేకపోవడం. సరే, ఇక పాయింట్ కి వచ్చేద్దాం. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ తెలంగాణలో సర్వే తాజాగా నిర్వహించింది. రాష్ట్రంలో ఏయే పార్టీ తరఫున ఏయే నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు..? ఏ పార్టీకి 2019లో అధికారంలోకి వచ్చే ఛాన్సులు మెండుగా ఉన్నాయి..? ఇలాంటి అంశాలపై పొలిటికల్ కోషియంట్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది.
ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకూలంగా తెలంగాణలో 47.45 శాతం మంది మాట్లాడారు. ఇక, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ఆలోచనకు మద్దతుగా 19.6 శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరు పేర్లు వినిపించాయి! ఈ రేసులో ఉన్న సీనియర్ నాయకుడు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేవంత్ తరువాత ఎక్కడో కింద ఉన్నారు. జానాకి అనుకూలంగా 13 శాతం మంది స్పందించారు. ఉత్తమ్ సీఎం అభ్యర్థిత్వానికి కేవలం 7 శాతం మంది మాత్రమే అనుకూలంగా మాట్లాడారు.
రాష్ట్రంలో మరోసారి తెరాస అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా 43.1 శాతం మంది చెప్పారు. కాంగ్రెస్ కు అధికారం దక్కుతుందని 22.95 శాతం అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశాన్ని 16.24 శాతం మంది ఇచ్చారు. ఆ తరువాతి స్థానంలో భాజపా ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… కేసీఆర్ తరువాత రాష్ట్రంలో బాగా పాపులారిటీ రేవంత్ రెడ్డి దక్కించుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చే పార్టీలో టీడీపీ మాత్రం రెండో స్థానంలో లేదు. అంటే, రేవంత్ పై మాత్రమే ప్రజలకు నమ్మకం ఎక్కువ.. టీడీపీపై తక్కువ అనేది అర్థమౌతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని ఇక్కడ కూడా తేలింది. ఎందుకంటే, తెరాస తరువాత అధికారం దక్కించుకునే పార్టీగా కాంగ్రెస్ మాత్రమే ఉంది. నిజానికి, ఈ విషయం కేసీఆర్ కు బాగా అర్థమౌతోంది కాబట్టే… ఈ మధ్య కాంగ్రెస్ నేతల మీద పడుతున్నారు. వారిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి, ఈ సర్వే రేవంత్ కు బాగా అనుకూలించేలా ఉంది. టీడీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో..?