ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పుణ్యమాని రాత్రికి రాత్రే నాయకులు అయిపోయినవారు చాలా మందే ఉన్నారు. మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మి కూడా అలా పేరు తెచ్చుకున్న నాయకులే. ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకంగా తమకు తోచినట్టుగా మాట్లాడేశారు మంచు మోహన్‌బాబు, లక్ష్మిలు. రెచ్చగొట్టడానికే ప్రాధాన్యత ఇచ్చారో, లేక తెలంగాణాపైన ప్రేమతో ఇంపార్టెన్స్ ఇచ్చారో…..లేకపోతే రేటింగ్స్ కోసం హైలైట్ చేశారో తెలియదు కానీ మీడియావాళ్ళు మంచు వారి మాటలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేశారు. అలా అని చెప్పి ఆ తర్వాత సమైక్యాధ్ర ఉద్యమంలో మంచువారు చించేసింది కూడా ఏమీ లేదు. తెలంగాణా ప్రజలను, నాయకులను రెచ్చగొట్టడానికి, గొడవలు పెంచడానికి మాత్రం ఆ వ్యాఖ్యలు బాగానే ఉపయోగపడ్డాయి. ఇలాంటి వాళ్ళను నమ్ముకున్న సీమాంధ్రులు దగాపడ్డారు. మంచు వారు మాత్రం ఇప్పుడు కల్వకుంట్ల వారికి చాలా మంచి స్నేహితులు అయిపోయారు.
ఆ తర్వాత నరేంద్రమోడీకి అనుకూలంగా మంచు లక్ష్మి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఓట్ల కోసం చేసే స్టంట్స్‌లో ఎన్నో కొత్త కొత్త మార్గాలు కనిపెట్టిన మోడీ మంచు లక్ష్మి అతిని కూడా బాగానే ఉపయోగించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాస్తంత పబ్లిసిటీకి పనికొస్తుందంటే అత్యంత ఎక్కువ అతి చేసేవాళ్ళ లిస్టులో మంచు లక్ష్మినే మోడీవారికి అగ్రస్థానంలో కనిపించినట్టుంది. మోడీ వారి సెలక్షన్ నిజంగానే అదిరిపోయింది. ఆయనకు బాగానే ఉపయోగపడింది. మరి మోడీ గురించి ఓ స్థాయిలో చెప్పిన వాళ్ళు……..ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి సీమాంధ్రులను నిలువునా దగా చేస్తుంటే మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాల గురించి మోడీకి అత్యంత సన్నిహితులమన్న స్థాయిలో బిల్డప్ ఇచ్చిన మంచు వారు చేసినది ఏమైనా ఉందా? ఇప్పుడు టిటిడి ఈవో నియామకం విషయంలో మోహన్‌బాబు మాటల్లో కూడా ఆయన సొంత అవసరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉత్తర-దక్షిణమంటూ లేని సమస్యను పట్టుకుని ట్విట్టర్లో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉత్తరాది ఐఎఎస్ నియామకం గురించి కూడా తన స్టైల్లో ఎవరినీ నొప్పించకుండా..చంద్రబాబుకు అసలే బాధ కలగకుండా ఓ ప్రకటన పడేశాడు. పవన్ కాదు కదా….రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చెప్పినా కూడా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోడు అన్న విషయం తెలిసిందే. అందుకే టిటిడికి వరుసగా వెళ్తూ ఉండే మోహన్‌బాబు ఇప్పుడు ఆ కొత్త ఈవోను కాకా పట్టే పనిలో పడ్డట్టున్నాడు. పనిలో పనిగా పవన్ చేసిన ప్రకటనకు వ్యతిరేక ప్రకటన చేస్తే మాంచి పబ్లిసిటీ వస్తుందని కూడా మంచువారికి తెలియని విషయమా?
తెలుగు సినిమా నాయకులు కమ్ రాజకీయ నాయకులందరికీ కూడా అసలైన ప్రజా సమస్యలపై పోరాడే ఆసక్తి అస్సలు ఉండదు. ఒకవేళ ఉన్నా ప్రకటనలకే పరిమితమవుతారు తప్ప ఆచరణలో చేసేది ఏమీ ఉండదు. పబ్లిసిటీ స్టంట్స్ మాత్రం చేస్తూ ఉంటారు. ఉరికి వ్యతిరేకంగా మంచు లక్ష్మి మాట్లాడిన మాటలు అయితే మరీ కామెడీగా ఉంటాయి. పబ్లిసిటీ దొరుకుతుంది అనే విషయాలపైన తప్పితే గ్రామీణ సమస్యలు, రైతు సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు లాంటి పాలకులకు కోపాన్ని తెప్పించే సమస్యల గురించి అస్సలు ప్రస్తావించరు ఎందుకో? అంత శ్రద్ధ ఉంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం మోడీ, చంద్రబాబులపైన పోరాటం చెయ్యొచ్చుగా. పబ్లిసిటీ జిమ్మిక్స్‌తో ప్రజలకు ఒరిగేది ఏముంటుంది?