భారతీయ ఐటీ రంగం మరోసారి సంక్షోభం దిశగా అడుగులేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. దాంతోపాటు మారుతున్న టెక్నాలజీస్ ను కూడా అందిపుచ్చుకోవాల్సిన తరుణమిది. దీంతో మనదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవడం మొదలైంది. ఇండియాలోనే మూడో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో 600 మందిని తొలగించింది. అంతేకాదు, ఈ ఏడాది విప్రో ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండకపోతే మరో 10 శాతం ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెబుతున్నారు. మరో ప్రముఖ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కూడా ఉద్యోగుల కోత మొదలుపెట్టింది. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం. దీంతో మరోసారి భారతీయ ఐటీ రంగం సంధి దశలో పడింది.
అయితే, సంక్షోభ సమయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ అవకాశంగా మార్చుకోగలుగుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, వచ్చే రెండేళ్లలో లక్షకుపైగా ఐటీ ఉద్యోగాలు తీసుకొస్తామని ఈ మధ్య లోకేష్ చెబుతున్నారు. విజయవాడలో వరుసపెట్టి ఐటీ కంపెనీలను ఇటీవల ప్రారంభించారు. రాష్ట్రానికి రాబోతున్న సంస్థలకు వీలైనంత త్వరితగతిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే నారా లోకేష్ భూకేటాయింపుల కమిటీలో చేరినట్టు టీడీపీ సమర్థించుకుంది. ఇంకోపక్క.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి కొన్ని ఐటీ సంస్థలు ఆంధ్రాకి వస్తాయని ఆయన చెబుతున్నారు. రాబోయే దశాబ్దంన్నరపాటు ఏపీ వృద్ధి రేటు 12 నుంచి 15 ఉంటుందనీ, కాబట్టి ఏపీకి పెట్టుబడులతో రావాలంటూ ఎన్నారైలకు ఆహ్వానం పలుకుతున్నారు.
నిజానికి, ఇప్పుడు ఐటీ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం తాత్కాలికమే కావొచ్చు. కానీ, దాని ప్రభావం మాత్రం కొన్నేళ్లపాటు ఉంటుంది. ఇతర అనుబంధ రంగాలపైనా ఉంటుంది. మరి, ఈ సంక్షోభాన్ని ఏపీ మంత్రి లోకేష్ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. ఆయన చెబుతున్నట్టు వచ్చే రెండేళ్లలో… అదీ ఇలాంటి సంక్షోభ సమయంలో లక్ష ఉద్యోగాలు ఐటీ రంగంలో కల్పించగలిగితే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు అమెరికాలో చెబుతున్నంత కాకపోయినా.. దాన్లో కొంతైనా ఏపీలో ఐటీ అభివృద్ధి ఈ దశలో ప్రారంభం అయితే ఆయన మరోసారి హైటెక్ ముఖ్యమంత్రి అవుతారనడంలో సందేహం లేదు. మంత్రిగా నారా లోకేష్ ను పాస్ చేసే అవకాశం ఇది. మరి, ఈ సవాలను అవకాశంగా తీసుకుంటారో… సంక్షోభంగా భావిస్తారో వేచి చూడాలి.