ఎ.ఐ.సి.సి. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి! అన్నీ కాకపోయినా, కొన్ని అనుకూలించినా పార్టీ పగ్గాలు అందుకునేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ, ఆ కొన్నిలో ఒక్కటైనా అనుకూలించడం లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో రాహుల్ ఇమేజ్ మారిపోతుందని ఆశించారు. అంతవరకూ ఆయనకు ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డే ఉంది. రాహుల్ పర్యటించిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలేవీ కాంగ్రెస్ కి ప్లస్ కాలేదు. యూపీలో కూడా అదే పరిస్థితి. రాజకీయంగా అత్యంత కీలకమైన యూపీలో పరాజయం మూలగట్టుకోవడంతో కొన్నాళ్లపాటు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడా ఓటమి నుంచి తేరుకుని తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు యువరాజు సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోంది అనే కథనాలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ చేయించుకున్న వ్యక్తిగత సర్వేల్లో కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే గట్టి పోటీ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది! అందుకే, ఆయన కాంగ్రెస్ నేతల్ని ఈ మధ్య బాగా టార్గెట్ చేస్తున్నారు. సో… తెలంగాణలో కాంగ్రెస్ ఫ్యూచర్ పై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై తరచూ తెలంగాణలో పర్యటించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. వీలైనన్నిసార్లు రాహుల్ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్టు టి. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తొలి సమావేశం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశమై రాష్ట్ర నేతలు చర్చించుకున్నారు. చివరికి, సంగారెడ్డి ఫిక్స్ చేశారు. జూన్ 1న రాహుల్ గాంధీ తెలంగాణ వస్తున్నారు. అదే రోజున సంగారెడ్డిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత, ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ అవుతారు.
మరోపక్క భాజపా కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. కొత్త నేతలను ఆకర్షించేందుకు పథక రచన జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అమిత్ షా సభకు ధీటుగా ఉండేలా జన సమీకరణ జరగాలని భావిస్తున్నారు.
ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇదో కొత్త పరీక్ష అని చెప్పాలి. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అంతే అనేట్టుగా ట్రాక్ రికార్డు ఉంది. యూపీలో కూడా అదే రిపీట్ అయింది. కనీసం, తెలంగాణ అయినా తన ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డును మారుస్తుందని ఆశిద్దాం.