రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం తమిళ నాట ఎప్పుడూ ఆసక్తికరమైన టాపిక్కే. `పాలిటిక్స్‌లోకి వస్తాను – రాను` ఏదీ తేల్చకుండా సంవత్సరాల తరబడీ ఊరిస్తున్నాడు రజనీకాంత్. ఈ సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీకి తమిళ నాట ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడినట్టు అక్కడి రాజకీయ శ్రేణులు విశ్లేషిస్తున్న నేపథ్యంలో… రజనీకాంత్ ఇప్పుడో ముందడుగు వేస్తున్నాడు. అందులో భాగంగా అభిమానులతో సంప్రదించి వాళ్లతో రాజకీయ ప్రవేశంపై చర్చిస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈనెల 15 నుంచి 19 వరకూ…. ఫ్యాన్స్ మీటింగ్‌ని నిర్వహించబోతున్నాడు రజనీ. ఐదు రోజుల పాటు వివిధ అభిమాన సంఘాలతో రజనీ భేటీ వేయబోతున్నాడు. ఈ ఫ్యాన్స్ మీటింగ్ వెనుక ప్రధాన ఉద్దేశం.. రజనీ పొలిటికల్ ఎంట్రీ నే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రవేశం గురించి రజనీ అభిమానుల సలహాలూ, సూచనలు తీసుకోబోతున్నాడని చెబుతున్నారు. తన కొత్త సినిమా విడుదలకు ముందు రజనీకి ఇలాంటి మీటింగులు పెట్టడం అలవాటే. కాకపోతే ఈసారి మాత్రం భారీ ఎత్తున సన్నాహాలు చేయడం, మీటింగ్ పేరుతో అభిమానులకు 5 రోజులు కేటాయించడం ఈ ఊహాగానాల్ని బలపరుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకొంటే.. ఓ పార్టీ ప్రకటించడం, లేదంటే ఓ పార్టీకి మద్దతు తెలపడానికి ఇదే సరైన సమయం. అందుకే రజనీ తొందరపడుతున్నాడునుకోవొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా… రజనీ ఏ పార్టీకీ మద్దతు తెలిపే అవకాశం లేదు. అందుకే.. రజనీ నుంచి కొత్త పార్టీ ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. మరోవైపు రజనీ బిజేపీ తీర్థం పుచ్చుకొంటారన్న ఊహానాగాలు వినిపిస్తున్నాయి. రజనీ పార్టీ పెడతాడా? బీజేపీకి జై కొడతాడా? అనే విషయంలో తమిళ నాట బెట్టింగులు కూడా జోరందుకొన్నాయని తెలుస్తోంది. మరి.. రజనీ ఈసారైనా కుండ బద్దలు కొడతాడో, లేదంటే ఎప్పటిలా… పాము చావకుండా, కర్ర విరక్కుండా వ్యవహరిస్తాడో చూడాలి.