మా పార్టీ ఎలా పనిచేస్తుందో తెలియక మీడియాలో ఏదేదో రాస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు భారీ నిధులతో బిజెపిలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం వుందని రాస్తున్నారు. ఎవరైనా సరే ఆరు వందల కోట్లు కాదు అంతకంటే ఎక్కువ తెచ్చినా సరే అమిత్ షా నిర్ణయానికి లోబడి వుండాల్సిందే. ప్రధాని మోడీతో సంప్రదించి ఆయన ఒక నిర్ణయం ప్రకటిస్తారు.అంతేగాని ముందస్తుగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మేము హామీలిచ్చే ముచ్చటే వుండదు అన్నారు టిబిజెపి నాయకులొకరు. తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్‌తో సహా చాలామంది కాంగ్రెస్ నాయకులు బిజెపిలో చేరతారనే కథనాలు ముమ్మరంగా వస్తున్నాయి. టిడిపి నేత రేవంత్ రెడ్డి వంటివారిపైనా ఇలాటి కథలు వచ్చి ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.అయితే రేవంత్ కాంగ్రెస్,వామపక్షాలతో సహా వివిధ పార్టీల నాయకులతో కలసి బృహత్ కూటమిఏర్పాటును ప్రతిపాదిస్తున్నట్టు చెబుతున్నారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఆచరణ సాధ్యం కాదని ఆయా ప్రధాన పార్టీలు అంటున్నాయి. రకరకాల పొందికలు వచ్చే అవకాశం వుంది. అయితే బిజెపి మాత్రం తనకు తానుగా యాభై నియోజకవర్గాలపై కేంద్రీకరించి సత్తా చూపించాలని ఉత్సాహపడుతున్నది. ఇప్పటికి సీట్లు పెద్దగా రాకున్నా ఓట్లశాతం బాగా చూపిస్తే విశ్వాసం కలుగుతుందని కూడా ఆలోచిస్తున్నారు.ఇలాటి నేపథ్యంలో వ్యక్తులుగా ఎవరు వస్తారన్నది ఏమంత ముఖ్యం కాదని తమ దూకుడు కొనసాగించడమే ఎజెండా అని బిజెపి నేతలుస్పష్టం చేస్తున్నారు. టిఆర్ఎస్ కేంద్రాన్ని బలపర్చడానికి రాష్ట్రంలోతమ ఎదుగుదల వ్యూహాలకు వైరుధ్యమేమీ లేదని , అధిష్టానం తమకు ఆ మేరకు అనుమతి ఇచ్చేసిందని వారు చెబుతున్నారు. నిధుల కొరత తమకు సమస్యే కాదని కూడా అంటున్నారు.