రైతులంటే తెలంగాణ ప్రభుత్వానికి చిన్న చూపైపోయింది. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో విధ్వంసాన్ని సృష్టించారనే ఆరోపణపై అరెస్టు చేసిన, రైతుల్ని మరింత అవమానించింది. దొంగలకూ లేదా కరడు గట్టిన నేరగాళ్ళు వేసినట్లు సంకెళ్ళు వేసి, ఖమ్మం కోర్టులో ప్రవేశపెట్టింది. సంకెళ్ళు వేసింది… పోలీసులు కదా ప్రభుత్వాన్ని అంటారేమిటనే సందేహమొస్తోందా. పోలీసులు కూడా ప్రభుత్వంలో భాగమే. ప్రభుత్వం చెప్పినట్టు చేయడమే వారి వంతు. అలాగని ప్రభుత్వం వారికి సంకెళ్ళువేయమని ఆదేశించిందనటం లేదు. సర్కారు వారి చల్లని చూపుకోసమే ఎవరైనా ఎదురుచూస్తుంటారు. అందుకు పోలీసు వ్యవస్థ భిన్నమేమీ కాదు.
ఈ సందర్భంగా మిర్చి యార్డులో కడుపు మండి రభస చేసిన వారినుద్దేశించి… వాళ్ళు రైతులా.. రైతుల వేషంలో వచ్చిన గూండాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య గుర్తొచ్చి ఉంటుంది పోలీసులు. గూండాలను ఏంచేస్తాం…సంకెళ్ళేస్తాం. ఆమాదిరిగానే వీరికీ ఇనుప సంకెళ్ళను వేసి, అందరూ చూస్తుండగా న్యాయస్థానానికి తెచ్చారు. బోనులో నిలబెట్టారు. పోలీసుల వైఖరి ప్రజా సంఘాలకు ఆగ్రహాన్ని తెప్పించింది. రాజకీయ పార్టీలూ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అన్యాయం జరిగిన వారు ఎలా స్పందిస్తారో రైతులు కూడా కడుపు మండిపోయి అలాగే స్పందించారు. వారి ఆగ్రహానికి కొంత ఆస్తి నష్టం జరిగింది. అంతమాత్రాన రైతుల్ని గూండాల్లా చూస్తారా అంటూ ధ్వజమెత్తుతున్నాయి. రైతులకు సంకెళ్ళు వేసిన, ఘటనపై చేయి, సైకిలును పట్టుకుంది. అదేనండి కాంగ్రెస్, టీడీపీ ఒకటయ్యాయి. కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాని నిర్ణయించుకున్నాయి. రైతుపై కేసులు తీసేసేంతవరకూ పట్టువీడమని చెబుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటయ్యాయి కాదనం.. ఇది ఈ అంశానికే పరిమితమవుతుందా లేక ఎన్నికలలో ఒకటిగా పోటీ చేసేందుకు దారితీస్తుందా? కేసీఆర్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా వచ్చేఐక్యత తాత్కాలికమే కాగలదు. వారి ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు మాత్రమే సహకరించగలదు. స్వార్థ ప్రయోజనాలను వీడి ప్రజా ప్రయోజనాలకోసం ఒక్కతాటిపై నిలిస్తే ఏ ప్రభుత్వమైనా రైతులను గూండాలతో పోల్చడం..చేతులకు సంకెళ్ళు వేయడం.. రౌడీ షీట్లు తెరవడం వంటి చర్యలకు దిగే సాహసం చేయదు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి