రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమా హీరోలకు పంచ్ డైలాగుల వాసనలు, కామెడీ వేషాలు పూర్తిగా పోవడం లేదు. ఇప్పుడు పవన్ కూడా అదే తరహాలో రాజకీయం చేస్తున్నాడు. ప్రజల కోసం ప్రాణాలిచ్చేస్తా….మాట కోసం ప్రాణాలిచ్చేస్తా …దేశం కోసం ప్రాణాలిచ్చే మొదటి పిచ్చివాడ్ని నేనే….ఇలా ప్రాణాలిచ్చేస్తా అని ఎక్కువ సార్లు కామెడీ పంచ్ డైలాగ్ పేల్చిన తెలుగు నేత ఈ మధ్య కాలంలో పవన్ స్టార్ ఒక్కరే. అలాగే పవన్ నోటి నుంచి తరచుగా వచ్చే ఒక డైలాగ్ పోరాటం చేస్తా అనడం. పోరాటానికి అర్థం అయినా పవన్‌కి తెలుసా అని ఆయన రాజకీయ వ్యవహారాలను పరిశీలిస్తున్నవాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. కానీ పవన్‌కి మాత్రం అలాంటివేవీ పట్టవు. ప్రాణాలిచ్చేస్తా అనే డైలాగ్‌లాగే పోరాటం చేస్తా అన్న డైలాగ్‌ని కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా వల్లెవేస్తూ ఉంటాడు.
గ్రూప్ 2 సమస్య విషయంలో కూడా ఇప్పుడు ఇదే స్టైల్లో ఓ పంచ్ డైలాగ్ పేల్చాడు పవన్. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. సమస్య పరిష్కారం అయ్యే వరకూ పోరాటం చేస్తా అన్నాడు. అంతేకాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి ఎప్పుడూ వెనుకాడను అనే స్టైల్లో మరో పవర్ఫుల్ డైలాగ్ కూడా పేల్చాడు పవన్. 2009 నుంచీ రాజకీయాల్లో ఉన్నాడు పవన్. ఈ ఏడెనిమిదేళ్ళలో పవన్ చేసిన పోరాటాలు ఎన్ని? పరిష్కరించిన సమస్యలు ఎన్ని? ప్రజా రాజ్యం పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు అంటే అన్నయ్య చిరంజీవి అడ్డుకున్నాడని అనుకుందాం. మరి 2014 నుంచీ ఇప్పటి వరకూ పవన్ చేసిన పోరాటాలు ఎన్ని? మోడీ, చంద్రబాబులకు ఓటెయ్యండి…..అధికారంలోకి వచ్చాక వాళ్ళు తప్పులు చేస్తే మీ తరపున నిలబడి నేను ప్రశ్నిస్తా అని ప్రజలకు ఘాఠ్ఠి హామీ ఇచ్చాడు పవన్. నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్, డబ్బులు, కోరికలకు దూరంగా హిమాలయాలకు వెళ్ళాలనుకునే సన్యాసి, 24 గంటలూ ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తూ, ఆవేధన చెందుతూ ఉండే గొప్ప మనిషి అని సినిమా ఫంక్షన్స్‌లోనూ, ఆ తర్వాత టిడిపి అనుకూల మీడియాలోనూ ఒక ప్లాన్ ప్రకారం చేసిన ప్రచారాన్ని నమ్మినవాళ్ళందరూ పవన్ చెప్పిన మాట విన్నారు. కానీ పవన్ ఏం చేశాడు? రెండేళ్ళ పుణ్య కాలం తర్వాత ప్రత్యేక హోదా పోరాటాన్ని ఏ స్థాయిలో చేయబోతున్నాడో ఆవేశంగా ప్రజలకు వివరించాడు. ఆ తర్వాత ఓ రెండు సభలు పెట్టి మోడీ, చంద్రబాబులను వదిలేసి సామంతులను మాత్రం పిచ్చి పిచ్చిగా విమర్శించి మమ అనిపించాడు. ఆ తర్వాత ఆ ఊసే లేదు. ఇక రాజధాని రైతుల కష్టాలకు కరిగిపోయినప్పుడు కూడా పోరాటం చేస్తానన్నాడు. ఆ తర్వాత కష్టం వచ్చినప్పుడల్లా రాజధాని ప్రజలు పవన్ ఫొటో పట్టుకుని ధర్నాలు చేశారు కానీ పవన్ మాత్రం కనీసం ట్విట్టర్లో స్పందించింది కూడా లేదు. కిడ్నీ బాధితుల విషయంలో కూడా పోరాటం ఎలా చేయబోతున్నాడన్న విషయాన్ని ప్రజలకు చెప్పాడు. ఓ కమిటీ వేస్తానన్నాడు, పదిహేను రోజుల్లో నివేదిక అన్నాడు. ఆ తర్వాత ఆ ఊసే లేదు. అసలు పోరాటం గురించి మాట్లాడే అర్హత పవన్‌కి ఉందా? లేకపోతే పవనిజం అని కొత్తగా పేరెట్టుకున్నట్టుగానే పోరాటం అంటే ట్విట్టర్లో ట్వీట్ చేయడమే అని ఓ కొత్త సిద్ధాంతం ఏమైనా తయారుచేసుకున్నాడా?
ఇక మోడీ అంటే నాకు భయం లేదు అని కూడా పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ పేల్చాడు. అసలు మోడీ అంటే భయం ఉందా? లేదా? అన్న విషయం తర్వాత…..చంద్రబాబు అంటే ఎందుకంత భయం? చంద్రబాబును గట్టిగా నిలదీయడానికి, విమర్శించడానికి ఎందుకు ధైర్యం లేకుండా పోతోంది పవర్ స్టార్ అని ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు, జగన్‌లు జాతీయ స్థాయిలో మోడీకి భయపడి…ఆయన దగ్గర సాగిలపడుతున్నారు. పవన్ కళ్యాణేమో ఎపి స్థాయిలోనే చంద్రబాబునే విమర్శించే ధైర్యం లేక టైం పాస్ రాజకీయాలు చేస్తున్నాడు అన్న విమర్శలకు పవన్ దగ్గర సమాధానం ఉందా?