ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం సర్కారు తీరు భలేగా ఉంది! ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తూతూ మంత్రంగానే ఉంటున్న తీరును చూస్తున్నాం. కానీ, పార్టీలోని నేతలకు ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అధినాయకత్వం అమలు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీని నమ్ముకున్నవారికీ, ఫిరాయింపు నేతలకు గతంలో అధినాయకత్వం కొన్ని హామీలు ఇచ్చిందట. ఆ హామీలను గడచిన మూడేళ్లలో బాగానే అమలు చేసిందని అంటున్నారు. రాజకీయ అవసరాల కోసం.. ముఖ్యంగా పోలీసు శాఖను టీడీపీ సర్కారు ఇష్టానుసారం వాడేసుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఒక్కోటిగా కొట్టేసేలా ఆదేశాలు జారీచేసిన తీరు చర్చనీయాంశంగా మారుతోంది.
తాజాగా… గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై కొన్ని కేసులను టీడీపీ సర్కారు మాఫీ చేయించిందట! అశోక్ రెడ్డి ఫిరాయింపు నేత. వైకాపా టిక్కెట్టు మీద ఆయన గెలిచారు. తరువాత, టీడీపీకి ఆకర్షితులయ్యారు. ఆయన వైకాపాలో ఉండగా ఈ టీడీపీ ప్రభుత్వమే అక్రమంగా కేసులు బనాయిస్తోందని వాపోయేవారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కేసుల్లో తనను ఇరికించారనీ, ఇదంతా టీడీపీ కుట్ర అని అప్పట్లో అంటుండేవారు. అయితే, కేసులు పెట్టగలిగినవారు మాత్రమే వాటిని తీయించగలరు అని భావించారో ఏమో తెలీదుగానీ.. అశోక్ రెడ్డి తెలుగుదేశంలోకి చేరిపోయారు. ఇంకేముంది… వడ్డించేవారు మనవారు, తాజాగా ఒక జీవోని వడ్డించేశారు! ఆయనపై ఉన్న కేసుల్ని ఎత్తివేస్తూ ఒక జీవో విడుదలైంది. సో… దీంతో ఆయన కేసులు మాఫ్ అయిపోయాయి!
అయితే, ఇది ఒక్క అశోక్ రెడ్డి విషయంలో జరిగి ఉంటే చూసీచూడనట్టుగా సర్దుకుని పోవచ్చు. కానీ, ఇదే క్రమంలో గతంలో కూడా ప్రముఖ నేతలకు కేసు మాఫీ ప్రకటించారు! మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావులపై ఉన్న కేసుల్ని కూడా ఇలానే జీవో తీసుకొచ్చి కొట్టేశారు. కోడెల శివప్రసాదరావు కూడా ఈ మార్గంలోనే కేసు మాఫీ పొందారు! కరెక్ట్ గా చెప్పాలంటే తెలుగుదేశం మూడేళ్ల పాలనలో ఈ తరహాలు జీవోలు 132 వచ్చాయని ఓ కథనం! సో… ఇక అంకెలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మాటల్తో పనేముంది చెప్పండి.
అధికారంలో ఉన్నవారికి ప్రజల అవసరాలే ముఖ్యం అనుకుంటాం. కానీ, వాటికంటే ముందుగా రాజకీయ అవసరాలు అతి ముఖ్యం అని చెప్పుకోవాల్సి పరిస్థితి! ఏ నాయకుడిపైన అయినా సరే ఒక కేసు ఉందంటే, అది అక్రమంగా బనాయించింది అయినా సరే, న్యాయపోరాటం ద్వారా నిరూపించుకోవాలి. అంతేగానీ, జీవోలను అడ్డం పెట్టుకుని బయటకి వచ్చేయడమేంటండీ..!