ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోవడంపై తెలుగుదేశం నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కేసుల మాఫీ కోసమే ప్రధాని కాళ్లు పట్టుకునేందుకు వెళ్లారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మోడీని కలిసిన సందర్భంగా ప్రత్యేక హోదా గురించి జగన్ ఎందుకు మాట్లాడలేదన్నారు! అంతేకాదు… రాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కావాలంటే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎందుకు లింక్ పెట్టలేదని మంత్రి దేవినేని వైకాపాని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిసి ఉంటే ప్రత్యేక హోదా గురించి ఎందుకు గుర్తుకురాలేదన్నారు.
సరే.. జగన్ ఢిల్లీ వెళ్లింది వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, కేసుల మాఫీ కోసమే అని కాసేపు ఫిక్స్ అవుదాం! నిజానికి, దేవినేని మంచి టాపిక్కే రైజ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై ఇంతవరకూ తెలుగుదేశం ఒత్తిడి తెచ్చింది లేదు. కానీ, తాము చేయాల్సిన పని ప్రతిపక్షం చేయాలని మంత్రి చెప్పడమే విడ్డూరం. వైకాపాతో పోల్చుకుంటే టీడీపీకి అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా కంటే టీడీపీ మద్దతు కోసమే భాజపా ఎక్కువగా ప్రయత్నిస్తుంది కదా! అలాంటప్పుడు, తెలుగుదేశం కూడా ఇదే తరహాలో ప్రత్యేక హోదాకి లింక్ పెట్టొచ్చు కదా. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు కావాలంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చంద్రబాబే డిమాండ్ చెయ్యొచ్చు కదా. ఇలాంటి గొప్ప అవకాశాన్ని టీడీపీ ఎందుకు వదులుకోవాలి..? వైకాపాకి ఎందుకు ఇవ్వాలి..? ప్రతిపక్ష నాయకుడిగానే జగన్ పనికిరాడు అంటూ గతంలో ఎన్నోసార్లు దేవినేని విమర్శించారు. అలాంటప్పుడు ప్రత్యేక హోదాపై జగన్ కేంద్రాన్ని ఎందుకు కోరలేదని ప్రశ్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?
జగన్ చేయాల్సిన ప్రయత్నం గురించి దేవినేని ఇప్పుడు మాట్లాడుతున్నారు! కానీ, టీడీపీ ఇంతవరకూ చేసిన ప్రయత్నమేంటో ఆయన చెప్పగలరా..? ప్రత్యేక హోదా అత్యవసరం అంటూ ఒకప్పుడు గొంతు చించుకున్న టీడీపీ నేతలు… హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటూ ఎందుకు మారిపోయారో వివరించగలరా..? ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని, కుమారుడు నారా లోకేష్, ఏపీ మంత్రి వర్గం.. అందరూ ప్రత్యేక హోదా అవసరమే అన్నారు ఒకప్పుడు. మరి, రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో.. జగన్ ఫెయిల్ అయిన చోటే టీడీపీ ఎందుకు పాస్ కాకూడదు! ఇదే మాటను చంద్రబాబుకు చెప్పి ఆయనతో దేవినేని డిమాండ్ చేయిస్తే మరింత బాగుంటుంది కదా!