అదిగో పులి అంటే ఇదిగో తోక అనే నైజం ఎంతగా ప్రబలిపోయిందో చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. ఆఖరుకు దుర్ఘటనలకు కూడా దీన్ని ఆపాదించేస్తున్నారు. కార్ల కంపెనీ ఒకే మోడల్ కార్లను దాని ధరను బట్టి కొన్ని వందల సంఖ్యలో తయారు చేస్తుంది. హైఎండ్ మోడల్స్ అయితే పదుల సంఖ్యలోనే ఉంటాయి. అంతమాత్రాన ఓ ప్రముఖుడి కారు ప్రమాదానికి గురైతే, అది మరో ప్రముఖుడిదని ముడిపెట్టేయడమేనా. సోషల్ మీడియాలో ఇలాంటి అశుద్ధ వార్తలకు కొదవలేదు. రాజకీయ నాయకుల్ని భ్రష్టు పట్టించేయడానికీ.. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికీ సామాజిక మాధ్యమ ప్రియులు ఎప్పుడూ ముందుంటున్నారు. అందులో ఉచ్ఛంనీచం వారికి పట్టడం లేదు. తమ పోస్టుతో సంచలనం సృష్టించామా లేదా… అంతే వారు కోరుకునేది. చంద్రబాబు గురించైనా.. జగన్ గురించైనా.. లోకేశ్ గురించైనా ఇదే తీరు. వీళ్ళు మారరని మరోసారి రుజువైపోయింది.
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రమాదంలో దుర్మరణం పాలైనప్పుడు ప్రయాణిస్తున్న కారు పవన్ కల్యాణ్ అమ్మేసిందేనని నిన్న ఒక వార్తను సోషల్ మీడియాలోకి వదిలారు. చూడ్డానికి టాటా సుమోలా ఉండే ఆ కారును బెంజి కంపెనీ తయారు చేసింది. ఇక్కడ ధరల ప్రస్తావన అనవసరం. పెద్దవారు కాబట్టి కోటి రూపాయలకు తక్కువ కారును వారు వాడరనేది వాస్తవం. తాను కొన్న బెంజి కారును ఈఎమ్ఐలు కట్టలేక అమ్మేశానని అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ చెప్పిన మాట పట్టుకుని, అదే కారును నిశిత్ కొన్నారనీ, ప్రమాదానికి గురైంది ఆ కారేననీ కథ అల్లేశారు. ఇంకేముంది సోషల్ మీడియాకు కావాల్సినంత ఉపాహారం లభించింది. అంతన్నాడింతన్నాడోయ్ గంగరాజన్నట్లు చిలవలు పలవలైపోయింది. పైగా అపోలో ఆస్పత్రి దగ్గర పవన్ కల్యాణ్ విషణ్ణ వదనంతో కూర్చున్నారని కూడా రాసేశారు. ఒక నిండు ప్రాణం బలైపోయి, అంతా ఆ వ్యక్తి గురించి దుఃఖపడుతుంటే ఈయన అక్కడ కూర్చుని తన కారును తలచుకుని బాధపడతారా. ఇలా ఉంది సోషల్ మీడియాలో కపిత్వం ప్రదర్శిస్తున్న వారి ఆలోచన వైఖరి. తన పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడానికి సోషల్ మీడియాపైనే ఆధారపడ్డ పేకే దృష్టికి ఈ అంశం వెళ్ళింది.
ఇక గమ్మునుండ లేరుగా. వెంటనే దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. ప్రమాదానికి గురైన కారు తాను విక్రయించింది కాదని చెప్పారు. తాను వాడింది నిశిత్ కారు కంటే ముందు మోడల్ని తెలిపారు. నిశిత్ కారు హై ఎండ్ మోడల్ అని కూడా వివరించారు. రాంచరణ్ వివాహానికి తన కారులోనే వెళ్ళాననీ, తొమ్మిది నెలల క్రితం వాయిదాలు కట్టలేక విక్రయించాననీ పవన్ కల్యాణ్ చెప్పారు. విషయం ఏదైనా ఒక దుర్ఘటనకూ సెలబ్రిటీ కారుకూ ముడిపెట్టేసి, చిలవలుపలవలుగా కథలల్లేయడం సోషల్ మీడియాకే చెల్లింది. ఫిఫ్త్ ఎస్టేస్గా పేరు తెచ్చుకుంటున్న సోషల్ మీడియా ఈ వైఖరిని వీడకపోతే.. పేనుకు పెత్తనమిచ్చిన చందాగానే ఎక్కువ శాతం మంది అభిప్రాయానికొచ్చే అవకాశముంది. విశ్వసనీయతే ఆయుధంగా సాగితే.. ఒక వ్యక్తి పెట్టే పోస్టుకు కూడా ఎంతో విలువనిస్తున్న నెటిజన్లను ఇలాంటి వార్తలు అయోమయంలోకి నెడతాయి.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి