శర్వానంద్ వరస విజయాలతో దూకుడుమీదున్నాడు. బాక్సాఫీసు దగ్గర భీకరమైన పోటీ ఉన్నప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాల్ని సొంతం చేసుకొంటుంటాడు. గత సంక్రాంతి సీజన్లలో అదే జరిగింది. ఆ విజయాలు ఇచ్చిన ధైర్యంవల్లేనేమో… ఒకపక్క బాహుబలి ప్రభంజనం కొనసాగుతుండగానే… తన `రాధ`తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వా. మరి ఆయన విజయాల పరంపరని ఈ చిత్రం కొనసాగించేలానే ఉందా? తొలిసారి ఖాకీ చొక్కా వేసిన శర్వా తెరపై చేసిన సందడి ఎలా ఉంది? తదితర విషయాల్ని తెలుసుకుందాం పదండి..
కథ :
రాధాకృష్ణ (శర్వానంద్) శ్రీకృష్ణుడి భక్తుడు. చిన్నప్పుడే దుష్ట శిక్షణ కోసం పోలీసు కావాలని నిర్ణయించుకొంటాడు. ఇంకా ఉద్యోగం రాకపోయినా పత్రికల్లో వచ్చే వార్తల్ని చూసి దుష్టుల్ని శిక్షించేందుకు నడుం బిగిస్తుంటాడు. ఆ ప్రయత్నం చేసి నలుగురు కరడుగట్టిన నేరగాళ్లని పోలీసులకి అప్పజెబుతాడు. దాంతో రాధాకృష్ణ పేరు డీజీపీ దృష్టికి వెళుతుంది. అతని తెగువని మెచ్చి డీజీపి నేరుగా పోలీసు ఉద్యోగం ఇస్తాడు. ఇక నేరగాళ్ల పని పట్టడమే తరువాయి అనుకొంటున్న తరుణంలో అసలు నేరాలే లేని ఓ ప్రాంతానికి పోస్టింగ్ ఇస్తాడు. దాంతో నీరుగారిపోయిన రాధాకృష్ణ ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటాడు. అదే సమయంలో ఆ ఊళ్లో అందమైన అమ్మాయి రాధ (లావణ్య)ని చూసి మనసు పారేసుకొంటాడు. ఆమె వెంట తిరుగుతున్న సమయంలోనే రాధాకృష్ణకి హైదరాబాద్‌కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి హైదరాబాద్‌కి వెళ్లాక ఆయనకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ముఖ్యమంత్రి కావాలనుకొన్న హోం మంత్రి సుజాత (రవికిషన్)తో రాధాకృష్ణకి వైరం ఎలా ఏర్పడింది? అతను చేసిన నేరాల్ని రాధాకృష్ణ ఎలా బయటపెట్టాడు? అనే విషయాలతో మిగతా సినిమా సాగుతుంది.
విశ్లేషణ :
సక్సెస్ఫుల్ ఫార్ములా అని వాడేశా… అంటూ కథానాయకుడు ఈ సినిమాలో ఓ డైలాగు చెబుతాడు. అది కథానాయకుడి కంటే దర్శకుడికే ఎక్కువగా వర్తిస్తుంది. పెద్దగా కథ లేకపోయినా ఫర్వాలేదు, కథానాయకుడి టైమింగ్, స్టైల్, కాసిన్ని కామెడీ సన్నివేశాలతో బండిని నడిపించేయొచ్చని అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు నిరూపిస్తుంటాయి. అవి బాగా ప్రభావం చూపినట్టున్నాయి దర్శకుడిపైన. అందుకే కథ విషయంలో పెద్దగా కసరత్తులేమీ చేయకుండా `రాధ` తీశాడు. దాంతో అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా కొంచెం కామెడీ, కొంచెం రొమాన్స్, కథానాయకుడి స్టైల్‌తో కూడిన కొన్ని సన్నివేశాలు పండిపోయాయి. మిగతాదంతా కూడా రొటీన్ వ్యవహారం. కథ మచ్చుకైనా ఆసక్తి రేకెత్తించదు. కథనంలో మేజిక్కులు ఎక్కడా కనిపించవు. ఒక చిన్న కేసుని, ఓ చిన్న ప్రేమకథని చివరిదాకా లాగి లాగి అయిందనిపిస్తాడు దర్శకుడు. కేవలం 2 గంటల 5 నిమిషాల సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని ప్రేక్షకుడు ఎదురు చూస్తుంటాడంటే సినిమా సాగేవిధానం ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్‌హాఫ్ అయినా ఫర్వాలేదు. సరదా సరదాగా సాగే సన్నివేశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి కాలక్షేపం అవుతుంది. సెకండాఫ్ అయితే పరమ రొటీన్ వ్యవహారం. కథ ఎంతకీ ముందుకు సాగదు. తొలి భాగంలో మొదలైన కథ ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అంతే. తీరా ప్రి క్లైమాక్స్‌లో కథలో ఓ సంఘర్షణ మొదలైనా.. చివరికొచ్చేసరికి అది కూడా తుస్సుమంటుంది. అసలు కథేమీ లేకపోవడంతోనే ఈ సాగదీత అనే విషయం అప్పుడు పరిపూర్ణంగా అర్థమవుతుంది. శర్వానంద్ తన కామెడీ టైమింగ్‌తోనూ, తన నటనలో గ్రేస్తోనూ చాలా సన్నివేశాల్ని లాగించాడు. కానీ చివరికొచ్చేసరికి ఆయన ప్రభావం కూడా పనిచేయలేకపోయింది. కథానాయకుడి పాత్ర చిత్రణలోనే కాస్త వైవిధ్యం కనిపిస్తుంది.
సాంకేతికత.. నటీనటులు….
సాంకేతికంగా ఈ సినిమాకి మైనస్ మార్కులే. ముఖ్యంగా దర్శకుడి అనుభవరాహిత్యం అడుగడుగునా బయట పడుతుంది. లాజిక్ లేకుండా సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు. ఏ పాత్ర ఎప్పుడు ఎండ్ అవుతుందో, ఏ పాత్ర ఎప్పుడొస్తుందో అర్థం కాదు. పాటల టైమింగ్ కూడా కరెక్టుగా లేదు. పాట కోసమే పాట అన్నట్టుగా సాగుతుంటాయి. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం ఫర్వాలేదు అనిపిస్తుంది. రథన్ సంగీతం ఫస్ట్‌హాఫ్‌లో ఉన్నంత జోష్‌గా సెకండ్‌హాఫ్‌లో లేదు. నిర్మాతలు మాత్రం బాగానే ఖర్చు పెట్టారు. ఓ స్టార్ హీరో స్థాయిలోనే సినిమాని నిర్మించారు. నటీనటుల్లో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయాలతో ఉన్న ప్రభావమో మరేంటో కానీ.. ఆయన నటనలోనూ, ఆయన కనిపించే విధానంలోనూ కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపించింది. అది ఈ సినిమాకి మరింత ప్లస్సయింది. షకలక శంకర్, సప్తగిరి, జయప్రకాష్‌రెడ్డి, ఫిష్ వెంకట్ తదితరులతో కలిసి శర్వానంద్ చేసిన సన్నివేశాలే సినిమాకి బలం. లావణ్య త్రిపాఠి అందంగా కనిపించడానికే పరిమితమైంది. నటించే అవకాశం మాత్రం ఆమెకి అస్సలు రాలేదు. అక్ష ఓ పాటలోనూ, ఒకట్రెండు సన్నివేశాల్లో మాత్రమే సందడి చేస్తుంది. రవికిషన్ బాగా నటించాడు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకొనేంత ఏమీ లేదు.
ఫైనల్‌గా: రొటీన్ సారాంశం
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5