2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ, చంద్రబాబుల పొత్తు మొగ్గ తొడిగిన తర్వాత నుంచీ టిడిపి జనాలు, ఆ పార్టీ అనుకూల మీడియా, పవన్ కళ్యాణ్….ఇంకా టిడిపి భజన బృందంలో ఉన్న చాలా మంది మోడీని ఆకాశానికెత్తేశారు. వెంకయ్యనాయుడి లాంటి భజన రాయుడిని కూడా మించిపోయి ఇష్టారీతిన మోడీని పొగిడేసి దేవుడ్ని చేసిపడేశారు. మోడీకంటే ఎంతో సీనియర్ అయిన చంద్రబాబే సాగిలపడిన తర్వాత ఇక బాబు భజన బృందానికి వేరే ఛాయిస్ ఎలా ఉంటుంది? శశికళను జైలుకు పంపించినప్పుడు అవినీతిపైన ఉక్కుపాదం మోపుతున్న మోడీ అనే స్థాయిలో వార్తలు రాశారు. ఇక ప్రస్తుతం దేశం మొత్తం మీద ఉన్న ఎక్కువ మంది నాయకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోడీతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నవాళ్ళే. ప్రస్తుతానికి అత్యంత శక్తివంతుడిగా కనిపిస్తున్న మోడీ రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. అలాంటి మోడీతో పోరాటానికి కాలుదువ్వుతున్న నేత కేజ్రీవాల్ ఒక్కడే. కానీ ఆ కేజ్రీవాల్‌ని దేశంలోనే అత్యంత ఎక్కువ అవినీతిపరుడు అనే స్థాయిలో ఈనాడులాంటి అగ్రశ్రేణి పత్రికలు కూడా వార్తలు ప్రచురిస్తుంటే మోడీ ముందు మీడియా జనాలకు కూడా ఏ స్థాయిలో మోకరిల్లుతున్నారో అర్థమవుతూనే ఉంది. అదే సమయంలో దేశంలో ఉన్న అవినీతిని అంతమొందించడానికి దిగివచ్చిన దేవుడిగా మోడీని కీర్తించడంలో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇఫ్పుడు ఆ దేవుడే ప్రపంచంలోనే అత్యంత పెద్ద అవినీతిపరుడని టిడిపి మీడియా చెప్పిన జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారని సాక్షి వాళ్ళు వార్తలు వండేశారు. మోడీతో జగన్ మీటింగ్‌లో తప్పేముందని బిజెపి నేతలు టిడిపి నేతలకు కౌంటర్స్ ఇస్తున్నారు. తనపై ఉన్న కేసులు కొట్టివేయించుకోవడానికి మోడీ కాళ్ళపైన పడ్డాడు జగన్ అని టిడిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో వస్తున్న వార్తలకు అయితే అంతూ పొంతూ లేదు. విమర్శలన్నీ కూడా జగన్‌పైనే ఎక్కుపెడుతున్నారు కానీ మోడీని విమర్శించే ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఒక అవినీతిపరుడు వెళ్ళి కాళ్ళపైన పడినంత మాత్రాన అతనిపై ఉన్న కేసులన్నింటినీ మాఫీ చేసేస్తాడా మోడీ? అంటే శశికళ మోడీ కాళ్ళపైన పడలేదు కాబట్టే జైలుకు పంపించాడా? ఓటుకు నోటు కేసు విషయంలో కూడా మోడీ కాళ్ళపైన పడ్డారు కాబట్టే చంద్రబాబును వదిలేశారా? కేజ్రీవాల్ మోడీకి ఎదురు తిరుగుతున్నాడు కాబట్టే అతన్ని అవినీతి కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే మోడీ అత్యంత పెద్ద అవినీతిపరుడు, తనకు మోకరిల్లిన వాళ్ళను రక్షించడం కోసం, ఎదురుతిరిగినవాళ్ళను శిక్షించడం కోసం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి మరీ మేనేజ్ చేస్తున్నవాడు అని అర్థం చేసుకోవాలా? ఇప్పుడు టిడిపి నేతలు మాట్లాడుతున్న మాటలు, టిడిపి మీడియాలో వస్తున్న వార్తలను విశ్లేషిస్తే అర్థమవుతున్న విషయం ఇదే. మరి అలాంటి మోడీని ఇదే నారా చంద్రబాబు, టిడిపి నేతలు, టిడిపి భజన మీడియా అందరూ కూడా దేశాన్ని ఉద్ధరించడానికి ధీరుడు అని ఎలా చెప్తున్నారు? ఏది నిజం? మిగతా వాళ్ళను విమర్శించే ముందు మోడీ అవినీతిపరుడా? కాదా? అనే విషయంపైన చంద్రబాబు అండ్ కో ఓ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే బాగుంటుందేమో.