ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోడీ అండ్ టీం ఆంధ్రప్రదేశ్‌కి పూర్తిగా అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికైనా మళ్ళీ నిలబడుతుందా అన్న అనుమానాల మధ్య కేంద్రం నిర్ణయం సీమాంధ్రులను షాక్‌కి గురిచేసింది. విభజనలో కూడా కాంగ్రెస్‌తో సమాన భాగాన్ని పంచుకున్న బిజెపి….ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాంగ్రెస్ కంటే ఎక్కువ ద్రోహం చేసింది. అయితే బలమైన టిడిపి భజన మీడియాతో పాటు చంద్రబాబు అండ్ కో అంతా కూడా ఆ అన్యాయం గురించి ప్రజలకు తెలియకుండా ఉండేలా చాలా చాలా మాయోపోయాలే పన్నుతున్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ గొప్పదని ఒకసారి, ప్యాకేజ్‌కి ఒప్పుకోకపోతే పోలవరం పూర్తి కాదని ఒకసారి ఇష్టారీతిన మాట్లాడేస్తూ ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో మోడీని, చంద్రబాబును గెలిపించండి……అంతా నేను చూసుకుంటా అనే స్థాయిలో హామీలిచ్చిన పవన్ కళ్యాణేమో చంద్రబాబుకు ఇబ్బందికలగకుండా…చేశానంటే చేశాను అనేలా ప్రత్యేక హోదా కోసం ట్విట్టర్లో పోరాటం చేస్తున్నాడు. అఫ్కోర్స్…….ఈ మధ్య అది కూడా చేయడం లేదనుకోండి.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా రావాలంటే బిజెపికీ చంద్రబాబు కటీఫ్ చెప్పాలని, డెడ్‌లైన్ విధించాలని, టిడిపి ఎంపిలు, కేంద్రమంత్రుల చేత చంద్రబాబు రాజీనామా చేయించాలని డిమాండ్స్ వినిపించాడు వైఎస్ జగన్. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అదే బిజెపికి బేషరతుగా మద్దతు ఇస్తున్నానని జగనే ప్రకటించాడు. ఇంతకంటే రాజకీయం వేరే ఏమైనా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశాడు కాబట్టి ఆయనతో తెగతెంపులు చేసుకోవాలని డిమాండ్ చేయడం ఏంటి? ఓటుకు నోటు కేసు భయమో, లేకపోతే తాను బయటికి వస్తే జగన్ దూరిపోతాడన్న భయమో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం మోడీకి బానిసగా ఉండడానికే సిద్ధపడిపోయాడు. మేం బయటికి వస్తే తాను దూరాలన్నదే జగన్ ఆలోచన అని అప్పట్లో టిడిపి జనాలు చాలా సార్లు విమర్శించారు. ఇఫ్పుడు జగన్ తీరు చూస్తుంటే టిడిపి నాయకుల మాటలే నిజమనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కాదు…….మోడీతో తాను పొత్తు పెట్టుకోవడం కోసమే బాబును బయటికి రమ్మని డిమాండ్ చేస్తున్నట్టుగా ఉంది.
అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే బిజెపికి బాబు బానిసగా ఉంటే ఆయనను అభిమానించే కుల జనులు, ఆ పార్టీ భజన మీడియా, ఆ పార్టీ మద్ధతుదారులు సంతోషపడుతుండడం……..అలాగే జగన్‌తో మోడీ మీటింగ్ అవగానే జగన్ భజన మీడియా, ఆయన మద్ధతు కులజనులు, పార్టీ జనాలు సంతోషపడుతుండడం……..అంటే మోడీతో వైరం పెట్టుకుంటే జగన్, చంద్రబాబులు ఇద్దరికీ కూడా గడ్డు కాలమే అని అందరికీ తెలుసన్నమాట. అలాగే టిడిపి, వైకాపా జనాలకు రాష్ట్రం ఎటుపోయినా ఫర్వాలేదన్నమాట.