ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఘన విజయం తర్వాత బిజెపి 2019 ఎ న్నికల్లో ఘన విజయం సాధించేస్తుందని ఆ పార్టీ నేతలు భారీ ప్రచారం మొదలుపెట్టేశారు. గతంలో బలహీనంగా వున్న నియోజకవర్గాలలో రాష్ట్రాలలో ఆ పార్టీ అద్యక్షుడు అమిత్ షా విస్త్రతంగా పర్యటిస్తున్నారు కూడా. ఈ వూపులోనే తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుందని ఎపిలో స్వంత బలం పెంచుకుంటామని చెబుతున్నారు. వైసీపీ నాయకుడు జగన్ ప్రధానితో సమావేశమై మద్దతు ప్రకటించడం, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూల వైఖరి బిజెపికి చాలా వూతమిస్తున్నాయట. ఈ నెల 23,24 తేదీలలో అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారనేది ఖాయమైంది.ఎపికి వస్తారని, అప్పుడే రానన్నారని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు బిజెపి అధికారంలో రావడం గాని, కీలక శక్తిగా ఎదగడం గాని జరిగేపని కాదు. అయితే పెద్ద పార్టీల నుంచి నేతలను రాబట్టాలని, ఈ సారి ఓట్లశాతం పెంచుకుని ప్రజల విశ్వాసం చూరగొంటే 2014లో అధికారం అప్పగిస్తారని బిజెపి నాయకులు ఏవే వ్యూహాలు చెబుతున్నారు.
అయితే ఈ సంగతి ఎలా వున్నా మతపరమైన ఉద్రిక్తతలు, నినాదాలు కూడా తీవ్రమవుతున్న సంగతి చాలా మంది గుర్తిస్తున్నారు. అసలు ఉత్తర ప్రదేశ్‌లోనే యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టాక శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయనే అభిప్రాయం బలపడుతున్నది.మాసం దుకాణాలపై దాడులు చేస్తే నిరసన వ్యక్తమైంది. వాటిని ముందు తెరిపించి లైసెన్సులు పునరుద్ధరించాలని, ఎవరు ఏం తినాలో మీరెలా నిర్ణయిస్తారని సుప్రీం కోర్టు మందలించింది.ఇక మైనారీటీలు పెద్ద సంఖ్యలో వుండే సహనాపూర్ నెల రోజులుగా ఉద్రిక్తతలలో ఉడికిపోతున్నది. దీనికి ప్రతిగా వారు వాహనాలు ధగ్గం చేయడం దాడులకు పాల్పడం జరుగుతున్నది. రాజధాని లక్నోలోనూ దోపిడీ ఘటనలు హత్యలు పెరిగాయి. ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహిని సభ్యులు మేము చేతులు కట్టుకుకూచుంటామా అంటూ వ్యతిరేకులను వేటాడేందుకు వ్యూహరచన చేస్తున్నారు. వీటి విషయంలో కేంద్ర బిజెపి నాయకుల నుంచి పెద్ద ఖండనలు రాలేదు గనక పరోక్ష మద్దతు ఉందనే భావించాల్సి వస్తుంది.
ఇక తెలంగాణకు వస్తే అదిలాబాదులో ఇలాటి పరిస్థితే ఎదురైంది. ఈ మధ్య ఏదో ఘర్షణ తలెత్తి మైనార్టీ వర్గానికి చెందిన వారు కార్ల అద్దాలు పగలగొట్టారు. దాంతో బిజెపి నేతలు ధర్నాలు నిరసనలు చేపట్టారు.హిందూ యువవాహిని మరో అడుగు వేసి మరింత రెచ్చగొట్టే కార్యక్రమం మొదలు పెట్టింది. పోలీసులు వారించినా వినకుండా నిరసన కార్యక్రమం చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. హైదరాబాదులో గతంలో విషపూరితంగా మాట్లాడిన ఎంఎల్ఎ రాజాసింగ్‌తో మాకు సంబంధం లేదని ప్రకటించేవారు. కాని ఇప్పుడు ఆయనను అక్కున చేర్చుకుంటున్నారు. పైగా మా నమ్మకాలకు అడ్డం వస్తే చంపేస్తామంటూ ఆయన టివిలలో బాహాటంగా మాట్లాడుతున్నారు. మాజీ అద్యక్షుడు కిషన్‌రెడ్డితో తప్ప మిగిలిన వారితో తనకేమీ వివాదం లేదని ఆయన అంటున్నారు.అమిత్ షా హైదరాబాదు నుంచి అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తారనేది ఒక కథనం కాగా ఆయనను ఓడించడం కోసం ముందునుంచే అన్ని విధాల వ్యూహాలు రచిస్తున్నారనేది సమాచారం. బిజెపి పెరుగుదల అంటే మతపరమైన ఉద్రిక్తతల పెరుగుదలా అనివార్యమయ్యేట్టుంది. అయితే తెలుగు వారు లౌకిక వాదమే కోరుకుంటారు గనక ఆ పాచికలు పారకపోవచ్చు.