ఖమ్మం మార్కెట్ యార్డు ఘటన తెలంగాణలో రాజకీయ కాక పెంచుతూనే ఉంది. తమకు మద్దతు ధర లేదన్న ఆవేదనతో కొంతమంది మార్కెట్ యార్డుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, అలా దాడి చేసినవారు రైతులు కాదు.. రౌడీలనీ, ఒకవేళ వాళ్లు రైతులు అని నిరూపిస్తే వాళ్ల కాళ్లు మొక్కుతానని అంటూ ఆ మధ్య తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో విపక్షాలు భగ్గుమన్నాయి. ఖమ్మం మార్కెట్ యార్డులో రైతు దీక్ష చేసిన టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని మళ్లీ గుర్తుచేశారు. తాజాగా రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన దీక్ష చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపై విమర్శలు గుప్పించారు.
ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడిచేసింది రౌడీలనీ, రైతులు కాదని నాడు తుమ్మల వ్యాఖ్యానించారని రేవంత్ గుర్తు చేశారు. రైతులని నిరూపిస్తే కాళ్లు పట్టుకుంటా అన్నారనీ.. ఇప్పుడు వారంతా రైతులే అని నిరూపణ అయిందని రేవంత్ అన్నారు. గతంలో ఆయన చెప్పినట్టుగానే, ఇప్పుడు రైతుల కాళ్లను కడిగి, ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటారా అంటూ తుమ్మలను ప్రశ్నించారు. రైతులను రౌడీలు అనడం దారుణమన్నారు. అన్నదాతల కాళ్లను కడిగి నెత్తిన పోసుకున్నా ఆ పాపం పోదన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద కూడా రేవంత్ సంచలన విమర్శలు గుప్పించారు. కోటి ఎకరాలను నీరు ఇస్తామని కేసీఆర్ పదేపదే చెబుతారనీ, కానీ లక్ష ఎకరాల మిర్చి పంటను కొనలేసి ఈ సన్నాని అన్ని ఎకరాలకు నీరు ఇస్తారంటే ఎలా నమ్మాలని రేవంత్ విమర్శించారు. సినిమా రంగంలోని తనకు ఇష్టమైనవారికి రాయితీలు కల్పించడమే మంత్రికి కేటీఆర్ కు తెలిసిన విద్య అనీ, రైతుల గిట్టుబాటు ధర గురించి ఆయనకేం తెలుసునీ ఎద్దేవా చేశారు. రుద్రమదేవి సినిమాకి రాయితీ ఇచ్చారనీ, ఇప్పుడు బాహుబలి వస్తే… నిర్మాతకు నష్టం వస్తుందనీ, దాన్ని తగ్గించడం కోసం ఇష్టం వచ్చిన్టటు టిక్కెట్ల ధరలు పెంచుకోవచ్చని జీవోలు జారీ చేశారని మండిపడ్డారు. అంతేగానీ, రైతుల విషయానికి వచ్చేసరికి వీళ్లు చేసిందేం లేదని రేవంత్ దుయ్యబట్టారు.
ఇంతకీ, ఈ వ్యాఖ్యలపై తుమ్మల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. తన ఇలాఖాలో రైతులు తిరగబడ్డారని తుమ్మల చెప్పుకోలేక.. రౌడీలు అనేశారన్నది వాస్తవం. రైతుల కోసం కేసీఆర్ సర్కారు చాలా చేస్తోందన్న భారీ ఎత్తు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. కాబట్టి, తిరగబడ్డది రైతులు అని చెప్పుకుంటే పోయేది కేసీఆర్ సర్కారు పరువే. అందుకే తుమ్మల గతంలో అలా వ్యాఖ్యానించారు. మరి, రైతులకు సంకెళ్లు వేసి పోలీసులు తీసుకెళ్లిన ఈ సందర్భాన్ని ఎలా సమర్థిస్తారో చూడాలి.