శర్వానంద్ జడ్జ్‌మెంట్ పై అందరికీ నమ్మకమే. రన్ రాజా రన్ నుంచి కమర్షియల్ హిట్లు కొట్టక ముందే.. కథల విషయంలో తాను ఎంత పక్కాగా ఉంటాడో అందరికీ అర్థమైంది. వేర్వేరు కారణాల వల్ల శర్వానంద్ ఫ్లాపులు చవి చూశాడు గానీ, కథల ఎంపికలో మాత్రం ఎప్పుడూ తప్పు చేయలేదు. తన పరిధి మేర.. బలమైన కథలనే ఎంచుకొన్నాడు. ఈమధ్య సాధించిన కమర్షియల్ విజయాలతో హిట్ హీరోగా నిలబడిపోయాడు. రాజ్‌తరుణ్, సాయిధరమ్ తేజ్‌లు పక్కన పెట్టిన ‘శతమానం భవతి’ కథని నమ్మి.. ‘ఓకే’ చేశాడు. దానికి తగ్గ ఫలితం సాధించాడు. శర్వా జడ్జ్‌మెంట్ ఎంత కరెక్ట్ గా ఉంటుందో, తాను ఎంచుకొన్న కథల్ని, వెన్నుతట్టిన దర్శకుల్ని చూస్తే అర్థం అవుతుంది. అలాంటిది.. రాధ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు శర్వా.
రాధ టైటిల్, ట్రైలర్.. అన్నీ ఆకట్టుకొన్నాయి. శర్వా మరో హిట్ కొట్టడం ఖాయం అనిపించింది. అదే ఆశతో థియేటర్లోకి అడుగుపెడితే… నాలుగైదు సన్నివేశాలకే కళ్లు బైర్లు కమ్మాయి. `ఏ పాయింట్ నచ్చి శర్వా ఈ కథని ఓకే చేశాడు` అనే విషయం జుత్తు పీక్కున్నా అర్థం కాలేదు. కొత్త కథల్ని ఎంచుకొనే శర్వా… మరీ ఇంత రొటీన్ కథకి ఓకే చెబుతాడని అస్సలు ఊహించలేదు. దీని వెనుక.. నిర్మాతల బలవంతమే ప్రధాన కారణం అనే మాటలు వినిపిస్తున్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ దగ్గర రెండేళ్ల క్రితమే అడ్వాన్స్ తీసుకొన్నాడు శర్వా. మధ్యలో ‘రాధ’ కథని పక్కన పెట్టి ‘శతమానం భవతి’ కూడా చేశాడు. పారితోషికం భారీగా ఇవ్వడం, మొత్తమంతా సింగిల్ పేమెంట్‌తో సెటిల్ చేయడం, బీవీఎస్ఎన్‌ప్రసాద్ ఖాతాలో అత్తారింటికి దారేది లాంటి భారీ విజయం ఉండడం, ఆయన ప్రమోషన్లు బాగా చేస్తారని నమ్మడంతో శర్వా ఈ కథకి ఓకే చెప్పాడు. అయితే.. రిజల్ట్ మాత్రం శర్వాని బాగా నిరాశ పరిచింది. కథ విషయంలో ఇంకెప్పుడూ మొహమాటపడకూడదని ‘రాధ’ గీతోపదేశం చేసినట్టైంది. ఈ తప్పు నుంచి శర్వా త్వరగా పాఠాలు నేర్చుకొంటే మంచిది.