సినిమాలు ముఖ్యమా?? ప్రజా జీవితం, వాళ్ల సమస్యలు ముఖ్యమా?? అని అడిగితే రెండో దానివైపే మొగ్గు చూపుతాడు పవన్ కల్యాణ్. సినిమాలంటే తనకు పెద్ద వ్యామోహం లేదని, సినిమాల నుంచి తప్పుకోవడానికి సైతం తాను సిద్దంగా ఉన్నానని ఇది వరకే చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే మాట చెప్పి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తానని.. కావాలంటే సినిమాలకు దూరం అవ్వడానికి కూడా తాను రెడీగానే ఉన్నానని చెప్పుకొచ్చాడు పవన్ కల్యాణ్. ఈరోజు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో అనంతపురం నుంచి వచ్చిన 150మంది ప్రతినిధులతో పవన్ సమావేశం అయ్యాడు. ఈ సందర్భంగా రాజకీయాలపై, సినీ జీవితం గురించీ పవన్ మాట్లాడాడు. తనని పార్ట్ టైమ్ రాజకీయ వేత్త అంటున్నారని, చాలామంది రాజకీయ నాయకులు ఇంట్లో కూర్చుని రాజకీయం చేస్తున్నారని, తాను మాత్రం అలాంటివాడ్ని కాదని, వీలైతే సినిమాలకు దూరమై పూర్తి స్థాయిలో ప్రజా సేవ చేస్తానని చెప్పుకొచ్చాడు పవన్.
”సినిమాలంటే నాకు గౌరవమే. నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది సినిమాలే. నా సిబ్బంది కోసం, వాళ్ల జీత భత్యాల కోసం సినిమాల్లో నటిస్తున్నా. ప్రజల కోసం.. సినిమాల్ని తాత్కాలికంగా పక్కన పెట్టి సేవ చేయడానికి సిద్దంగా ఉన్నా” అన్నాడు పవన్. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని, అనంతపురం జిల్లా నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతానని మరోసారి చెప్పాడు. సో.. పవన్ నిర్మాతలు, దర్శకులు కాస్త వేగం పెంచాల్సిందే. అయ్యగారి మూడ్ మారితే… షూటింగ్‌కి పేకప్ చెప్పేయడం ఖాయం.