ప్రతిపక్ష నేత జగన్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి రాజకీయ మద్దతు ప్రకటించిన తర్వాత ఎపిలో రాజకీయ వాదోపవాదాలు పెరిగిన సంగతి తెలిసిందే. టిడిపి వైసీపీ అదేదో మోడీని కలవడం గొప్పయినట్టు వాదించుకోవడం చికాకు తెప్పిస్తున్నది. ఇది చాలనట్టు అమెరికా నుంచి తిరిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జగన్పేరు, వైసీపీ పేరు ప్రస్తావించకుండానే రాజకీయంగా అనాల్సినవన్నీ అనేశారు.దేశంలో అవినీతి పరులపై దాడులు పెరుగుతున్నాయి గనక ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ కలిశారన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడ్డం బిజెపి వారికీ మింగుడుపడలేదు.సోము వీర్రాజు వంటివారు దీనిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో కొత్త వివాదం రెండు పార్టీల మధ్యనే గాక మంత్రివర్గ సభ్యుల మధ్యనే రాజుకోవడం విశేషం. గోదావరి జిల్లాలకు చెందిన దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు విచ్చలవిడి మద్యం అమ్మకాలు బెల్టుషాపులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కొత్తగా మంత్రి పదవి తీసుకుని ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన జవహర్‌బాబుకు ఇది ఇరకాటంగా మారింది. బెల్టుషాపులపై కఠినవైఖరి అనుసరిస్తామని ఆయన చెప్పినా అసలు వాటిని ఎలా నడవనిస్తున్నారని మాణిక్యాలరావు నిలదీస్తున్నారు. ప్రతిపక్షాలు గాక ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా వున్న వారే విమర్శలు చేస్తుంటే ఏం చెప్పాలో తోచని స్థితి జవహర్‌కు ఎదురవుతున్నదట. వాస్తవానికి ఇది బిజెపి స్వంత పునాది పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నమని కూడా మరో అభిప్రాయం వుంది. ఏది ఏమైనా ఇద్దరు మంత్రసల వివాదం రసవత్తర రాజకీయాన్ని తలపిస్తున్నది.ఈ విధంగానైనా మద్యం మహమ్మారిని అరికట్టే చర్యలు తీసుకుంటే అంతకంటే కావలసిందేముంటుంది?