ఏం చేసినా దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది! ఏదో ఒక ఎత్తుగడ ఉంటుంది. నిగూఢార్థాలు వేరుగా ఉంటాయి! ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ శైలి. ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఎప్పటికప్పుడు ఎలా జాగ్రత్తపడాలో ఆయనకి బాగా తెలుసు. ఆ మధ్య రైతుల సమస్యల స్వరం పెరిగిపోతుంటే… ఉచిత ఎరువులు, గొర్రెలు పెంపకం అంటూ ఆ గొంతుకి అడ్డుకట్ట వేసుకున్నారు! తాజాగా ఖమ్మం జిల్లాలో మిర్చీ రైతుల వ్యవహారంపై కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించారు. విచిత్రంగా పోలీసులకు క్లాస్ తీసుకున్నారు. రైతులకు సంకెళ్లు వేయడం మగతనమా అంటూ వారిని ప్రశ్నించారు! ఇది కూడా కేసీఆర్ మార్కు వ్యూహాత్మక ఎత్తుగడ అని చెప్పడంలో సందేహం ఏముంది..? ఇప్పుడు ధర్నాచౌక్ విషయంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహం కూడా ఇలానే రొటీన్ కి భిన్నంగా ఉంది.
ధర్నాచౌక్ తరలింపు విషయమై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మరోసారి ఆగ్రహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనకు మద్దతుగా బాగానే జనసమీకరణ చేసుకుంటున్నారు. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమమే. మామూలుగా అయితే, ఇలాంటి సమీకరణ జరుగుతున్నప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు ఉంటాయి. ముందస్తు అరెస్టులు ఉంటాయి. నాయకులను అదుపులోకి తీసుకోవడం, రెచ్చగొట్టే ధోరణి వంటివి ఉంటాయి. కానీ, ధర్నాచౌక్ విషయంలో ప్రభుత్వం నుంచి అలాంటి స్పందన లేదు. గన్ పార్క్ దగ్గర జరిగిన ఓ కార్యక్రమం జరిగితే.. పోలీసుల ప్రతిస్పందన ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, దాన్ని అస్సలు పట్టించుకోనట్టుగానే వ్యవహరించి ఆశ్చర్యపరచారు.
ఇదిలా ఉంటే, ధర్నాచౌక్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీచేపడుతుంటే.. అదే సమయంలో మంత్రి నాయని, గోపాల్ కలిసి అక్కడే ధర్నాకి దిగుతామంటూ సిద్ధపడ్డారు. ఇది కచ్చితంగా వ్యూహాత్మక ఎత్తుగడే అని చెప్పాలి. ఇది ప్రభుత్వ ప్రాయోజత కార్యక్రమంగానే చూడాలి. ధర్నాచౌక్ తరలింపునకు అనుకూలంగా, ప్రతికూలంగా ఒకే చోట ధర్నాలు అంటే ఏమని అనుకోవాలి..?
ధర్నాచౌక్ విషయంలో ప్రభుత్వం అనవసర పట్టుదలకు పోతున్నట్టుగా ఉంది. తరలిస్తాం అని ముందుగా ప్రకటించేశారు కాబట్టి, ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకుంటే ప్రతిపక్షాల ముందు తలొగ్గినట్టు అవుతుందన్న ధోరణిలో ఆలోచిస్తున్నారో ఏమో..! ఢిల్లీలో జంతర్ మంతర్ ఉందిగా. నగరం మధ్యలోనే ఉంది కదా. అలాంటప్పుడు హైదరాబాద్ లో ధర్నాచౌక్ ఎక్కడుంటే ఏంటీ..? ఓపక్క చౌక్ తరలింపు వ్యతిరేక ఉద్యమాలను పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ.. మరోపక్క ప్రభుత్వ ప్రాయోజిత ధర్నాలకు అనుమతి ఇవ్వడం అనేదే కేసీఆర్ వ్యూహాత్మకత! మొత్తానికి, ఇది ఎటువైపు వెళ్తుందో చూడాలి.