బాహుబలి అసాధారణ విజయంతో భారతీయ సినిమా దారి తప్పే ప్రమాదముందని హిందూలో బెంగుళూరుకు చెందిన సుందర్ సరుకారు అనే ఒక వ్యాసకర్త హెచ్చరించారు. తెలుగురాష్ట్రాలు రెంటిలోనూ ఆ చిత్రాన్ని విపరీతంగా ఆదరించడం వెనక భాషాభిమానం వుందని ఆరోపించారు కూడా. మామూలుగా గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ ప్రధానంగా వుండే ఇంగ్లీషు చిత్రాల్లో వుండే ఫోకస్ కూడా ఇందులో లేదని తేల్చారు. అయితే ఆయన విమర్శల్లో ఆలోచించదగిన అంశం ఒకటుంది. ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు, కొత్త హీరోహీరోయిన్లతో కొంత విభిన్నంగా తయారవుతున్న ప్రాంతీయ సినిమా మళ్లీ మోయలేని బడ్జెట్ల భారానికి గురి కావచ్చని హెచ్చరించారు. నిజంగానే పెళ్లిచూపులు, శతమానం భవతి వంటి చిత్రాలకు వచ్చిన అవార్డులు అందరికీ సంతోషం కలిగించాయి. ఆ ధోరణి పెరుగుతుందనుకుంటే ఇప్పుడు వెయ్యి కోట్లతో మహాభారతం, 600 కోట్లతో రామాయణం వంటి ప్రాజెక్టులు వినిపిస్తున్నాయి. అంటూ భూమార్గం పట్టిన సినిమా మళ్లీ ఆకాశంలోకి వెళుతుందన్న మాటే కదా! అయితే గతంలో మర్యాద రామన్న వంటి చిన్న చిత్రాలు తీసిన రాజమౌళి ఇప్పుడు కూడా అదే పని చేస్తే కొంత వరకూ వేలం వెర్రి ఆపొచ్చు.