ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జగన్ ఏయే అంశాలపై చర్చించారో బయటపెట్టాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు చాలామంది డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ప్రధానికి జగన్ చేసిన ఫిర్యాదు ఇదే అంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపైనే ప్రధానికి జగన్ ఫిర్యాదు చేసినట్టు ఆ కథనం సారాంశం!
ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు తనపై రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ ప్రధానికి ఇచ్చిన ఫిర్యాదులో జగన్ పేర్కొన్నారట. అదేంటీ.. ఈడీ అనేది పూర్తిగా కేంద్ర పరిధిలో ఉండే శాఖ కదా, అక్కడ చంద్రబాబు చక్రం ఎలా తిరుగుతుందనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కానీ, ఆ కథనం ప్రకారం జగన్ చేసిన ఫిర్యాదులో చెప్పింది ఏంటంటే.. ఈడీలోని ఎవరో ఇద్దరు అధికారులను తన చెప్పుచేతల్లో చంద్రబాబు పెట్టుకున్నారనీ, ఆయన స్కెచ్ ప్రకారమే సదరు అధికారులు వ్యవహరిస్తున్నారనీ, తనపై ఎప్పటికప్పుడు చర్యలకు దిగుతున్నారంటూ జగన్ ఫిర్యాదులో పేర్కొన్నారట! తన ఆస్తులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎటాచ్ మెంట్ ఆదేశాలు ఇప్పించేలా చంద్రబాబు ఒత్తిడి తీసుకొస్తున్నారని జగన్ అన్నారట. ఇప్పటికే ఎటాచ్ అయిన ఆస్తులపై కూడా మళ్లీ మళ్లీ ఫిర్యాదులు ఇప్పించడం ద్వారా తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో జగన్ పేర్కొన్నట్టు కథనం.
చంద్రబాబు ప్లాన్ ప్రకారమే తన కేసుల విషయమై ఈడీలోని ఇద్దరు అధికారులు స్పందిస్తున్నారనీ, చంద్రబాబు ఇస్తున్న మాస్టర్ ప్రకారమే తనపైనా, తన భార్యపైనా ఒత్తిళ్లు పెరుగుతున్నాయంటూ మోడీకి ఇచ్చిన ఫిర్యాదులో జగన్ పేర్కొన్నట్టు ఆ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. దీంతో, చంద్రబాబు సీక్రెట్ అజెండాను అమలు చేస్తున్న ఆ ఇద్దరు అధికారులు ఎవరా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇంతకీ, చంద్రబాబు చెబితే ఈడీలో ఈ స్థాయి కదలికలు ఉంటున్నాయా అనేది అసలైన ప్రశ్న? తనపై రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసులు బనాయించారంటూ జగన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. కానీ, ఈ స్థాయిలో ప్రధానికి చంద్రబాబుపై ఫిర్యాదు ఇవ్వడం అనే కథనం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా జగన్ ఢిల్లీకి వెళ్లి, ప్రధానితో ఏం మాట్లాడారనే అంశమై ఇంకా వైకాపా నుంచి ఎలాంటి స్పష్టతా రాలేదు. ఈ కథనంలోని నిజానిజాలు ఏపాటివో వైకాపా స్పందిస్తే తప్ప అసలు విషయాలు తెలీవు!