ఏడాదిలో రెండు సార్లయినా అమరావతిలో ఏదో శంకుస్థాపన చేయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలో ఒక భాగం. అలా చేసిన ప్రతిసారీ అనేక విషయాలు ఏకరువు పెడుతుంటారు. సోమవారం నాడు స్టార్టప్ క్యాపిటల్‌కు సంబంధించి సింగపూర్ కన్సార్టియంకు భూముల అప్పగింతపై అవగాహన కుదిరిందన్నారు. ఇరు పక్షాల ప్రతినిధులూ ప్రసంగాలు చేశారు. తాను మొదటి నుంచి సింగపూర్లాటి నగరం నిర్మిస్తానని చెబుతున్నానని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇందుకు ఒప్పుకున్నందుకు పదేపదే కృతజ్ఞతలు తెలిపారు.ఇక ఎప్పుడూ అరుదెంచే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చంద్రబాబు విజన్‌ను కొనియాడారు. ఈ స్థలాన్ని తాము డెవలప్ చేసి ఇవ్వడంలో తాము సహకరిస్తామన్నారు. తమ ప్రభుత్వం కంపెనీలు ఈ విషయంలో పాలు పంచుకుంటాయన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తామే నిర్మిస్తామని గాని, నిధులు తెస్తామని గాని చెప్పింది లేదు! రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో రాజధాని అంశాలు లేకపోవడం కూడా చెప్పుకోవాలి. రెండు వేర్వేరు కార్యక్రమాలను కలిపిన కారణంగా అలాటి అభిప్రాయం తెప్పించారు.
ఇంతకూ ఇప్పుడు వారు కట్టేది ఏమిటి? ఏ భవనాలు చేపడుతున్నారు? ఏమీ లేదు. పాలనా భవనాలు మనం కడుతుంటే సమాంతరంగా స్తలం అభివృద్ధి చేస్తారట. దాన్ని కమర్షియల్ ఫ్టాట్టుగా చేసి అంతర్జాతీయ కంపెనీలకు ఇస్తారట. ఐకానిక్ కట్టడాలను చేపడతారని మొదట అనుకున్నా అది కూడా ఈ రోజు స్పష్టంగా చెప్పలేదు. 2015 అక్టోబరులోనే సింగపూర్‌తో కుదిరిన ఒప్పందం మేరకు స్విస్ ఛాలెంజి పేరిట అప్పగించబోతే ఆదిత్య కన్‌స్ట్రక్సన్స్ వారు కోర్టులో సవాలు చేయడం, అక్షింతల తర్వాత కొన్ని మార్పులు చేసి మళ్లీ ఆ కన్సార్టియంకే అప్పగించారు. రాజధాని భవనాలు మనమే కట్టుకోవాలి. భూమిని ఇవ్వడమే గాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కలిగించాలి.అంతర్జాతీయంగా తమకున్న సంబంధాల మేరకు పెద్ద సంస్థలను తీసుకొచ్చి ఫ్లాట్లు విక్రయించడానికి మాత్రం వారు బాధ్యత తీసుకుంటారు. అందుకు లాభంలో అధిక వాటా పొందుతారు. మూడు దశలుగా జరిగే ఈ తతంగం పదిహేనేళ్లపైనే పడుతుందని అంచనా. జరిగేది వ్యాపార రాజధాని అయితే ప్రజా రాజధాని కట్టిస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రం. పైగా లక్షా 25 వేల కుటుంబాలు వచ్చి నివసిస్తాయని ఆయన చెప్పింది జనాభా లెక్కలను బట్టి జరిగే పని కాదు కూడా.