సినిమా జరుగుతున్నప్పుడే.. సాంకేతిక నిపుణులు హ్యాండిచ్చేసి వెళ్లిపోవడం తెలుగునాట కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కెమెరామెన్లు మధ్యలోనే వెళ్లిపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ సినిమా `జై లవకుశ`కీ ఇదే జరిగింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. బాబి దర్శకుడు. ఈ సినిమా కోసం సీకే మురళీధరన్ ని కెమెరామెన్‌గా తీసుకొన్నారు. సగం సినిమా అయ్యాక.. ఆయన స్థానంలో ఇప్పుడు చోటా కె.నాయుడు వచ్చాడు. దర్శకుడికీ, ఛాయాగ్రహకుడికీ పడడం లేదని, వాళ్లిద్దరి మధ్యా ట్యూనింగ్ కుదరకే… మురళీధరన్ టీమ్ నుంచి వెళ్లిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చిత్రబృందం మాత్రం ఈ గాసిప్పుల్ని ఖండించింది. ”కెమెరామెన్ మారిన మాట వాస్తవమే. కానీ… కారణాలు వేరే ఉన్నాయి. మురళీధరన్ డేట్లు జూన్ వరకే ఉన్నాయి. సినిమా పూర్తయ్యేంత వరకూ ఆయన టీమ్ తో ఉండలేరు. చివర్లో మరో కెమెరామెన్‌ని తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే.. ముందే వెళ్లిపోతున్నారు” అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దాదాపుగా ఫస్ట్ ఆఫ్ సినిమా పూర్తయ్యిందట, దీనికి సంబంధించిన డీఐ వర్క్ మురళీధరన్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, కేవలం సెకండాఫ్ చోటా కె.నాయుడు చూసుకొంటారని తెలుస్తోంది.