మిస్టర్ పర్ఫెక్ట్ అంటారే… ఆ టైపు దర్శకులలో మురుగదాస్ పేరు కూడా రాసుకోవొచ్చు. గజిని నుంచి తుపాకీ వరకూ చూసుకొంటే.. ప్రతీ సీన్ స్కేలు పెట్టి కొలిచినట్టు ఉంటాయి. ‘ఈ సీన్ ఇక్కడ అనవసరం’ అనిపించే సందర్భాలు మురుగదాస్ సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. స్క్రిప్టుకి ప్రాధాన్యం ఇచ్చి.. దాన్ని ఫాలో అయిపోయే దర్శకుడు మురుగదాస్. అయితే.. స్పైడర్ విషయంలో మాత్రం మురుగదాస్ లెక్కలు, ఆలోచనలు, ప్లానింగ్ ఇవన్నీ తలకిందులవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘స్పైడర్’ సినిమా రీషూట్ జరుపుకొన్నది అనేది పాత విషయమే. ‘మేం రీషూట్లు చేయలేదు’ అంటూ నిర్మాతలు బల్ల గుద్ది చెబుతున్నా.. ‘రీషూట్’ జరిగింది వాస్తవమే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. అయితే… ఈమధ్య కూడా కొన్ని సన్నివేశాల్ని డస్ట్ బిన్లో వేసి, ఆ స్థానంలో కొత్త సన్నివేశాలు రాసుకొని, వాటిని రీషూట్ చేయడానికి రెడీ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ విషయంలో మురుగదాస్ చాలా తర్జన భర్జనలు పడ్డాడట. రెండు మూడు వెర్షన్లు రాసుకొని అందులో ఓ దాన్ని షూట్ చేశాడట. అయితే.. ఎందుకో.. ఆ క్లైమాక్స్‌ని మార్చి, ప్రత్యామ్నాయంగా మరో క్లైమాక్స్‌ని తీయాలని నిర్ణయించుకొన్నాడట. కొన్ని రోజులు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడట. సీన్లు తనకు నచ్చినట్టు వచ్చేంత వరకూ కనీసం ఫోన్లో కూడా టచ్‌లో లేడట.
మురుగదాస్ వ్యవహార శైలిపై మహేష్ కూడా కాస్త గుర్రుగానే ఉన్నాడని, అయితే ఏరి కోరి మురుగదాస్‌తో చేయడం వల్ల.. పైకి ఏమీ అనలేకపోతున్నాడని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ విషయంలో తన అభిమానులు అంతగా సంతృప్తి పడలేదని తెలుసుకొన్న మహేష్.. మురుగదాస్ తో ఈ విషయం గురించి కూడా చర్చించాడట. వీలైనంత త్వరగా టీజర్‌ని విడుదల చేయాలని, లేని పక్షంలో కొన్ని స్టిల్స్ అయినా బయటపెట్టాలని సూచించాడట. అయితే.. మురుగదాస్ దానికీ సముఖంగా లేడని తేలింది. స్ర్కిప్టు రాసుకొని.. దాన్ని ఫాలో అయ్యే మురుగదాస్ తొలిసారి… ఆన్ లొకేషన్ లో మార్పులు చేయడం, తీసిన సన్నివేశాల్ని మళ్లీ రీషూట్ చేయడం చూస్తుంటే… మురుగదాస్‌కి ఏమైందో అనిపించక మానదు. ఏ సీన్ ఎన్నిసార్లు తీస్తే ఏముంది? సినిమా ఎంత ఆలస్యం అయితే ఏంటి? మహేష్ అభిమానులు సంబరాలు చేసుకొనేలా సినిమా తీస్తే చాలు. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ఇంతకు మించి ఏం కోరుకోవడం లేదు. కమాన్.. మురుగా… కమాన్!!