మీడియా ప్రజల పక్షాన నిలవాలి. ఎప్పుడో పెద్దలు చెప్పిన మాట ఇది. కానీ, కొన్ని రాజకీయ పక్షాలకు కొమ్ము కాయడమే పనిగా పెట్టుకున్న కొన్ని మీడియా సంస్థలున్నాయి. వాటి గురించి ప్రజలకు తెలుసు. అయితే, ఇలాంటి విషయాలపై చర్చలు జరిగినా, వాదోపవాదాలు జరిగినా ఇన్నాళ్లూ వ్యవహారం తెర వెనక మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడా తెర పూర్తిగా తొలగిపోతోంది. రాజకీయ పార్టీలూ పత్రికల మధ్య పోరాటం ఓపెన్ గానే జరుగుతోంది. ఆంధ్రజ్యోతి విషయంలో తాజాగా వైకాపా ఒక నిర్ణయం తీసుకుంది.
తమ పార్టీ ఆఫీసులకు ఆంధ్రజ్యోతి ప్రతినిధులుగానీ, ఏబీయన్ ప్రతినిధులుగానీ రావాల్సిన అవసరం లేదని వైకాపా ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రమంతా ఇదే రూల్ వర్తిస్తుందని చెప్పింది. అంతేకాదు, వైకాపా పార్టీ నేతలూ ప్రతినిధులెవ్వరూ ఈ మీడియా సంస్థలతో మాట్లాడరని కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమాన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా అణచివేసేందుకు అసత్య ప్రచారాలు చేస్తోందంటూ ఆ మీడియా సంస్థలపై మండిపడ్డారు.
ఆంధ్రజ్యోతి మీడియా విలువల్ని వదిలేసి, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రధానమంత్రిని జగన్ కలుకున్న నేపథ్యంలో అన్నీ అసత్య ప్రచారాలే చేస్తోందని ఆరోపించారు. ప్రధానికి ఇచ్చిన వినతిలో ప్రత్యేక హోదాతో సహా ఇతర అంశాలన్నీ ఉంటే… ఆ విషయాన్ని ఆంధ్రజ్యోతి పక్కతోవ పట్టించిందనీ, తెలుగుదేశం పార్టీ అజెండాను ఆంధ్రజ్యోతి భుజాలపై మోస్తోందన్నారు. తమ పార్టీ పట్ల ఆ మీడియా సంస్థ అనుసరిస్తున్న విధానాలపై ప్రెస్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేస్తామన్నారు.
సో.. ఇదండీ పరిస్థితి. మీడియా వెర్సెస్ రాజకీయ పార్టీల పోరాటం ఇలా తెరమీదికి వచ్చేసింది. నిజానికి, తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే పత్రికలూ సంస్థలూ ఎన్నున్నాయో.. వైకాపాకి కూడా కాస్త అటుఇటుగా అంతే మీడియా బలం ఉంది కదా! వీరు చేస్తున్న పనే వారూ చేస్తుంటారు..? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సదరు మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను కూడా ప్రజలు చూస్తున్నారు. నిజానికి, ఏ మీడియా సంస్థ ఎటువైపు ఉందో.. ఎవరి అజెండాలను ఎవరు మోస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇలా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక పత్రిక మీదా, ఒక ఛానెల్ మీదా విమర్శలు చేసినంత మాత్రాన ఉపయోగం ఏముంటుంది చెప్పండి! ఏ పార్టీ అజెండా ఆ పార్టీకి ఉంటుంది. అలాగే, కొన్ని మీడియా సంస్థలకూ పొలిటికల్ అజెండాలున్నాయి. ఎవరు చేయాల్సినవి, ఎవరు రాయాల్సినవి వారు రాస్తున్నారు. ప్రజలకు కూడా ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అర్థమౌతూనే ఉంటాయి! సో… ఇలాంటి చర్చల్ని తెర వెనక అలా ఉంచితేనే బెటర్!