ఈమధ్య సీక్వెల్స్ ట్రెండ్ తెలుగునాట బాగా ఊపందుకొంది. జయాపజయాల మాటెలా ఉన్నా, సదరు సినిమా బ్రాండ్ ని వాడేసుకోవడానికి దర్శక నిర్మాతలు తెగ ఆవేశ పడిపోతున్నారు. తాజాగా విక్రమార్కుడు సీక్వెల్ తెరపైకి వచ్చింది. రాజమౌళి – రవితేజ కాంబోలో విచ్చిన విక్రమార్కుడు కమర్షియల్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్లో రౌడీ రాథోడ్ పేరుతో రీమేక్ చేశారు. అక్కడా ఈ సినిమా బాగానే ఆడింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తయారు చేసే పనిలో ఉన్నారు విజయేంద్ర ప్రసాద్. అయితే.. ఈ సందర్భంగా ఆయనో మాట అన్నారు. ‘విక్రమార్కుడు సీక్వెల్ కథ రాయడం ఎంత సేపండీ.. మంచినీళ్ల ప్రాయం’ అన్నట్టు మాట్లాడారు. ఆయనకు కథ రాయడం మంచినీళ్ల ప్రాయమేమో. కానీ ‘విక్రమార్కుడు’కి తగిన కథ రాయడం, దాన్ని మించే సన్నివేశాలు తీయడం నిజంగా కష్టాతి కష్టమే.
అత్తిలి సత్తిబాబు, విక్రమ్రాథోడ్ క్యారెక్టర్లు ఆల్రెడీ జనాలు చూసేశారు. సీక్వెల్ తీస్తే.. అత్తిలి సత్తిబాబు క్యారెక్టరే ప్రధానం అవ్వాలి. ఎందుకంటే విక్రమ్ రాథోడ్ ఎప్పుడో చనిపోయాడు. అత్తిలి సత్తిబాబు లాంటి క్యారెక్టర్లు ఈమధ్య మహా తరచుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పాత్రని బేస్ చేసుకొని సన్నివేశాలు రాసుకొన్నా… కొత్తగా అనిపించకపోవొచ్చు. విజయేంద్ర ప్రసాద్ తలచుకొంటే మామూలు కమర్షియల్ సినిమా ఈజీగానే తయారైపోతుందేమో గానీ.. విక్రమార్కుడులో ఉన్న ఇంటెన్సిటీ.. సీక్వెల్లో ఉంటుందా? అనేది అనుమానమే. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ.. విక్రమార్కుడు కథని గట్టెక్కించగలిగింది. ఇప్పుడ ఈసీక్వెల్కి దర్శకత్వం వహించే స్థితిలో లేడు రాజమౌళి. కాబట్టి మరో దర్శకుడ్ని చూసుకోవాల్సిందే. రవితేజ గనుక `నో` అంటే.. అత్తిలి సత్తిబాబు పాత్ర తేలిపోతుంది. మరి.. ఇవన్నీ విజయేంద్రుడు దృష్టిలో ఉంచుకొన్నాడా??