మోడీ-జగన్‌ల మీటింగ్ తర్వాత నుంచీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఉన్నవాళ్ళకు ఫైనల్‌గా అర్థమయ్యే విషయం ఇదే. 2014 ఎన్నికలకు ముందు నుంచీ కూడా మోడీని వీరుడు, శూరుడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించిన టిడిపి భజన మీడియా కూడా ఇప్పుడు మోడీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే పనిలో పడినట్టుగానే కనిపిస్తోంది. అవినీతి కేసులను మాఫీ చేయించమని అడగడానికే జగన్ ప్రధానమంత్రిని కలిశాడని టిడిపి నేతలు, ఆ పార్టీ భజన మీడియా కేకల రంకెలు వేస్తోంది. అవినీతిపరులైన నేతలు మోడీని కలిసినంత మాత్రాన వాళ్ళపైన కేసులను మాఫీ చేసేస్తాడా? అంటే తను చెప్పినట్టుగా విననందుకే శశికళను కటకటాల వెనక్కి పంపించాడన్న విమర్శలు నిజమేనా? శశికళ అరెస్టుతోనే దేశంలో ఉన్న అవినీతి మొత్తాన్ని అంతం చేయడానికి మోడీ కంకణం కట్టుకున్నాడు అనే స్థాయిలో వార్తలు రాసిన ఈనాడు కూడా ఇప్పుడు టిడిపి నేతలు, జ్యోతి వార్తలను సమర్థిస్తుందా? మోడీకి ఎదురు నిలబడుతున్నాడు కాబట్టే, ప్రధానమంత్రి అయిన వెంటనే ఢిల్లీ ఎన్నికల్లో మోడీకి దారుణమైన పరాజయం చూపించి ప్రధాని అయిన ఆనందాన్ని హరించాడు కాబట్టే కావాలనే కేజ్రీవాల్ రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి కుట్రలు పన్నుతున్నాడన్న విమర్శలు నిజమేనా? అంటే మోడీ కూడా సోనియాగాంధీలాగే అవినీతిపరుడు, వ్యవస్థలను తన ఇష్టానికి ఉపయోగిస్తూ రాజకీయ ప్రత్యర్థులను సర్వనాశనం చేయాలనుకునే నియంత అనేనా? టిడిపి నాయకులు, ఆ పార్టీ భజన మీడియా వార్తలు అదే విషయాన్ని చెప్తున్నాయి.
టిడిపి వారి కథలు మోడీని అవినీతిపరుడిని చేస్తుంటే వైకాపా వాళ్ళ కథలు మాత్రం మోడీ అసమర్థుడు అని చెప్పేలా ఉన్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌కి 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు, 10లక్షల కోట్ల విలువైన అవగాహనా ఒఫ్పందాలపై సంతకాలు చేశామన్నారు….నిజమేనా జగన్?’ అని ప్రధాని మోడీవారు జగన్‌ని అడిగారట. మోడీ అలా అడిగాడని జగనే చెప్పాడు. ఒకవేళ నిజంగానే మోడీ గనుక జగన్‌ని అడిగి ఉంటే మాత్రం మోడీ అంత అసమర్థుడైన ప్రధానమంత్రి ఇంకొకరు లేనట్టే. 4లక్షల కోట్ల పెట్టుబడులు, 10లక్షల కోట్ల అవగాహనా ఒప్పందాల గురించి మోడీకి చెప్పింది ఎవరు? ఎవరో చెప్పారనే అనుకుందాం…..ఆ విషయం నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి మోడీకి ఇంతకాలం పట్టిందా? ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ తప్ప ఆ సమాచారం చెప్పేవాళ్ళు ఇంకెవ్వరూ లేరా? అయినా ఒక రాష్ట్ర ప్రతిపక్షనాయకుడిని ఆ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి అడిగితే సమాధానం ఏమని వస్తుందో ఈ మాజీ గుజరాత్ ముఖ్యమంత్రికి తెలియదా? బ్రహ్మాండంగా వస్తున్నాయని ఏ ప్రతిపక్ష నాయకుడైనా చెప్తాడా? ఈ వ్యవహారం అంతా కూడా పరమ సిల్లీగా ఉంది. మోడీ సమర్థతపై అనేక అనుమానాలు రేకెత్తించేలా ఉంది.
మొత్తానికి టిడిపి, వైకాపా కీచులాటలో ఈ సారి మోడీవారి ఇమేజ్ చాలానే డ్యామేజ్ అవుతోంది. ఇప్పటి వరకూ చంద్రబాబును, టిడిపిని వెనుకేసుకొచ్చిన రాష్ట్ర బిజెపి నాయకులు కూడా ఈ సారి జగన్‌కి వంత పాడుతున్నారు. విష్ణుకుమార్ రాజులాంటి బిజెపి నేత కూడా జగన్‌ని మాస్ లీడర్ అని అనడం రాజకీయ విశ్లేషకులను ఆశ్ఛర్యపరుస్తోంది. చంద్రబాబు, జగన్‌లకు వంతపాడడం మానేసి కాస్త మోడీ పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తే బెటరేమో.