మాజీసైనిక ఉద్యోగులకు `వన్ ర్యాంక్ వన్ ఫించన్’ పథకం అమలకు కేంద్రప్రభుత్వం అంగీకరించడంతో ఈ వివాదం దాదాపుగా సమసిపోయినట్లే భావించాలి. అయితే, ఇంకా కొన్ని మెలికలుమాత్రం అలాగేఉండటంతో మాజీ సైనికులు పెదవివిరుస్తుండటాన్ని త్రోసిపుచ్చలేం. అయితే దీనేనే సాకుగా తీసుకునికాంగ్రెస్ చేస్తున్న హడావుడిచూస్తుంటే వారికి అర్జెంట్ గా ఘనమైన కాంగ్రెస్ చరిత్ర పుస్తకాలను పంచిపెట్టకతప్పదనిపిస్తోంది.
గతం తెలిసిన సీనియర్ నాయకులు కూడా ఏమీతెలియని పిల్లనేతలతో కలసి దూకుడుకు మద్దతివ్వడం చూస్తుంటే, పెద్దతలకాయలకు మతిమరుపు జబ్బు పట్టుకున్నదనే అనుకోవాలి. 1971, 1973లో మన వీరసైనికులకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏంచేసిందో ఓసారి వీరికెవరైనా చెబితే బాగుండును. 42ఏళ్ల క్రిందట విజయోత్సాహంతో ఉన్న మాజీసైనికులకు ప్రధాని ఇందిరాగాంధీ ఎలా మొండిచేయి చూపించారో నేటి తరం నాయకులు కూడా తెలుసుకోవాలి. గతంలో చేసిన తప్పులను సరిదిద్దడానికి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని చిత్తశుద్ధితో చర్యలు తీసుకోలేదో వారిని అడ్డంగా నిలదీయాలి. నాలుగుదశాబ్దాలపాటు నిమ్మకునీరెత్తనట్లున్న కాంగ్రెస్ ఇప్పుడు మాజీసైనికులపై కడవళ్లకొద్దీ ప్రేమఒలకబోయడం పచ్చి రాజకీయ స్వార్థాన్ని చాటిచెబుతోంది. మాజీసైనికుల డిమాండ్లలో 98శాతం తీర్చడంతో మాజీసైనికులే ఒకపక్క హర్షం వ్యక్తంచేస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కోడిగుడ్డుమీద ఈకలు పీకడం పెద్ద జోకుగా మారిపోయింది. వాయిస్ రైజ్ చేయడానికి ఏ సమస్య లేవనెత్తాలో తెలియని పరిస్థితుల్లో ఘనమైన కాంగ్రెస్ కొట్టుమిట్టాడటం అత్యంత శోచనీయం. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లోనే కాంగ్రెస్ కి పట్టిన ఈ జాఢ్యం బయటపడింది.
కాగా, మాజీ సైనికోద్యోగులు మోదీని కలుసుకుని హామీలను లిఖితపూర్వకంగా ఆదేశాలివ్వాలని కోరారు. అప్పటిదాకా నిరాహారదీక్ష కొనసాగుతుందని తెలియజేశారు. నాయకులు ఇచ్చే హామీలపట్ల నమ్మకం సన్నగిల్లిందని చెప్పడానికి ఇదో ఉదాహరణమాత్రమే. మరి మోదీ ఈ అభిప్రాయాన్ని మారుస్తారనే అనుకుందాం.
42ఏళ్ల కిందటి మాట…
ముందస్తు పదవీ విరమణచేసిన వారిని కూడా ఓఆర్ఓపీ పథకం క్రిందకు తీసుకురావడంతో సమస్య దాదాపుగా పరిష్కారమైంది. దేశభద్రతకు తమ శ్రాయశక్తులు ధారపోస్తున్న సైనికులకు చేతనైనా సాయంచేయడానికి కేంద్రప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో మోదీసర్కార్ ను అభినందించాల్సిందే. అయితే ఇదే సమయంలో 42ఏళ్ల కిందట నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేసిన పనేంటన్నది కూడా గుర్తుచేసుకోవాల్సిందే.
సైనికోద్యోగులకు వేతనాల సిఫార్సు కోసం 70వ దశకంలో మూడవ వేతన సంఘం నియమించారు. ఈ సంఘం తన సిఫార్సులను 1973లో వెల్లడించింది. ఈ సిపార్సులను ఎలాగో అమలుచేయాలన్న సాకుచెప్పి ఇందిరాగాంధీ చాలా తెలివిగా సాయుధ బలగాలు పొందే పెన్షన్ మొత్తాన్ని కట్ చేసేశారు. ఇప్పుడు నాలుగుదశాబ్దాలుగా సాగుతున్న సంక్షోభానికి అప్పుడే బీజంపడింది. మరో విషయమేమంటే, 1971లో భారత్ – పాక్ యుద్ధంలో ఇండియాను గెలిపించిన సైనికులకు ఆ తర్వాతికాలంలో ఫించన్లలో కోతలతో వాతలుపెట్టారు. `ప్రాణాలకు తెగించి పోరాడితే ఇదా మాకు దక్కిన గౌరవం’- అంటూ మాజీసైనికులు వాపోయినా ఏలినవారికి చీమకుట్టినట్లైనాలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాజీసైనికుల పట్ల ప్రేమ ఒలకబోయడం విడ్డూరం. కుంభకోణాల్లో లక్షలకోట్లు మ్రింగేసే రాజకీయ అనకొండలకు దేశాన్ని కాపాడిన మాజీసైనిక ఉద్యోగుల క్షేమం తలకెక్కలేదు.
భారత సైన్యంలో సేవలందించి వాలెంటరీగా కానీ, లేదా పూర్తిగా సేవలిందించి గానీ పదవీవిరమణ చేసినవారి సంఖ్య సుమారు 30 లక్షలుదాకా ఉంటుందని ఒక అంచనా. మాజీ సైనికోద్యోగులకు ఒకే హోదాకు ఒకే ఫించను వర్తింపచేయాలని వారు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. చాలా ఏళ్లక్రితం పదవీవిరమణచేసినవారికీ, అదే హోదాలో ఇప్పుడు పదవీవిరమణచేసినవారికీ ఒకే మోస్తరుగా ఫించన్ ఇవ్వడమే ఈ పథక ముఖ్యోద్దేశం. 1973లో మూడవ పే కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారం, మిలటరీ పెన్షన్లను మామూలు పౌరసేవలవారికి ఇచ్చే పెన్షన్లతో సమానంగా చేస్తూ కుదించడం అప్పట్లోనే మాజీసైనికులను మనస్తాపానికి గురిచేసింది. మిగతా ప్రభుత్వ సేవావిభాగాలతో, మిలటరీ విభాగాన్ని పోల్చకూడదన్నది వారి వాదన. అలాగే, ఒకే హోదాగా పరిగణలోకి తీసుకుని ఒకే తరహాలో ఫించన్లు ఇవ్వాలని కూడా మాజీ సైనికులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. నాలుగుదశాబ్దాలుగా చక్కదిద్దలేని సమస్యను 98శాతం చక్కబెట్టిన మోదీసర్కార్ ను తప్పుబట్టడం ప్రతిపక్ష కాంగ్రెస్ తెలివితక్కువతనాన్ని సూచిస్తోంది. పాలకులు తప్పుదారిపడుతుంటే వారిని చక్కదిద్దడానికే ప్రతిపక్షం ఉండాలేకానీ, మంచిపనులుచేస్తున్నప్పుడు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, ఆందోళనలకు పూనుకోవడం, తమ తప్పులను మరచిపోయి రెచ్చిపోవడమన్నది సిగ్గుమాలిన రాజకీయాలకు పరాకాష్టగానే భావించాల్సిఉంటుంది.
– కణ్వస