రాజకీయంగా ప్రతి విషయంలోనూ చంద్రబాబుతో పోటీ పడాలనుకుంటూ ఉంటాడు జగన్. చంద్రబాబుపై ఏ చిన్న విషయంలో పై చేయి సాధించినా కూడా చిన్న పిల్లాడిలా సంబరపడిపోతూ ఉంటాడు. చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదు అని చెప్పేటప్పుడు జగన్ మొహంలో కనిపించే ఆనందం మామూలుగా ఉండదు. చంద్రబాబుపై పై చేయి నాదే అన్న ఆనందం అణువణువునా కనిపిస్తుంది. కానీ జగన్ ఆనందాలన్నీ కూడా అంతవరకే. జగన్ అనుభవం కూడా ఉప ఎన్నికల వరకే అన్నట్టుగా ఉంటోంది. అసలు విషయం వచ్చేసరికి చతికిలపడిపోతున్నాడు. ప్రత్యేక హోదాతో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ మోడీకి మద్ధతిస్తానని చెప్పి జిఎస్టీ బిల్లు పాస్ చేయడం కోసం అసెంబ్లీ సమావేశమైతే అసెంబ్లీలో గొడవ గొడవ చేయడంలోనే జగన్ అనుభవలేమి స్పష్టంగా అర్థమవుతోంది.
ఇక ఆంధ్రజ్యోతిపై నిషేధం విధించి చాలా పెద్ద తప్పిదం చేశాడు జగన్. ఆ మధ్య చంద్రబాబు నాయుడు సాక్షిని నిషేధిస్తే గొడవ గొడవ చేశాడు జగన్. ఆ విషయం ఇంకా ప్రజల మదిలో పదిలంగా ఉంది. ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబులాగే స్పందించడంతో వైకాపా నాయకులకు ఆ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియడం లేదు. నిజానికి ఆంధ్రజ్యోతి, సాక్షిలు ఒకే రకం మీడియా వ్యవస్థలు. జగన్‌ని సమర్థిస్తూ ఆంధ్రజ్యోతిలో ఒక్క వార్త కూడా రాదు. అలాగే చంద్రబాబును విమర్శిస్తూ వార్తలు రావు. అలాగే చంద్రబాబును సమర్థిస్తూ, జగన్‌ని విమర్శిస్తూ సాక్షిలో ఎప్పటికీ వార్తలు చూడలేం. కాకపోతే తెలుగునాట ఉన్న అన్ని మీడియా సంస్థలలోకి ఆంధ్రజ్యోతిది మరీ ఎక్కువ దిగజారుడు వ్యవహారం. ఓపెన్ హార్ట్ షోకు రాలేదని బ్రహ్మానందాన్ని అతి పెద్ద విలన్‌గా చిత్రీకరించడం, అలాగే డబ్బులు ఇవ్వని పాపానికి ఓ ఎనభై లక్షల సినిమాకు తెలుగు సినిమా పరిశ్రమకు పట్టిన దరిద్రం అనే స్థాయిలో రివ్యూ రాయడంలాంటివి వేరే ఏ మీడియాలోనూ చూడలేం. అలాగే ఎంతకైనా దిగజారి బురదజల్లడం విషయంలో రాధాకృష్ణను మించి ‘రాజకీయం’ చేసేవాళ్ళు తెలుగునాట ఇంకొకరు లేరు. సాక్షివారికి కూడా చంద్రబాబు విషయంలో అలా చేయాలని ఉంటుంది కానీ రామచంద్రమూర్తిలాంటి జర్నలిస్టులు మరీ అంతకు దిగజారలేరు.
ఇప్పుడు తాజాగా జగన్ విధించిన నిషేధంతో రాధాకృష్ణకు మరికొంత ఆనందమే తప్ప నష్టం ఏమీ లేదు. ఎందుకంటే రాధాకృష్ణకు నిజాలతో పనిలేదు. ఆయన ప్రపంచంలో ఆయన ఉండి రాజకీయ వార్తా కథలు రాసుకుంటూ ఉంటాడు కాబట్టి జగన్ పార్టీ ఆఫీసుకు జ్యోతి విలేఖరి వెళ్ళకపోయినంత మాత్రాన వాళ్ళకు వచ్చే నష్టం లేదు. కానీ ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని పత్రికా స్వాతంత్ర్యం విషయంలో కూడా జగన్ చాలా పెద్ద విలన్ అని ప్రచారం ఛాన్స్ ఇచ్చేశాడు. అలాగే చంద్రబాబుని విమర్శించే అవకాశం కోల్పోయాడు. అన్నింటికీ మించి సాక్షిని ఎప్పుడెప్పుడు మూసేయించేద్దామా అని వెయిట్ చేస్తున్న టిడిపి జనాలకు బ్రహ్మాండమైన నైతిక మద్ధతు ఇచ్చేశాడు జగన్. జగన్ చేసిన ఈ వ్యూహాత్మక తప్పిదంతో ముందు ముందు సాక్షికి మూడటం అయితే గ్యారెంటీ అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి సాక్షి లేకుండా ఉంటే చంద్రబాబుకంటే ఆనందపడే వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు. ఇఫ్పటికైతే ఆంధ్రజ్యోతిని మా పార్టీ మీటింగులకు రానివ్వం అని చెప్పేశారు కానీ ఈ చర్య తర్వాత సాక్షిపై చంద్రబాబు తీసుకునే చర్యలను ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.
గవర్నర్‌ని కలిసి బయటికి వచ్చి ఓ ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బయటికి వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాను అనే స్థాయిలో యథాలాపంగా నోరు జారాడు జగన్. ఆ ఒక్క మాటను పట్టుకుని వైకాపాను షేక్ చేసి పడేశాడు చంద్రబాబు. ఇప్పుడిక ఈ జ్యోతి నిషేధం నిర్ణయాన్ని అడ్డుపెట్టుకుని సాక్షి మూలాలను కదిలించకుండా ఉంటాడా? పార్టీ పుట్టి పూర్తిగా మునిగిపోయేలోపు అయినా జగన్‌కి వ్యూహాత్మకంగా చంద్రబాబును ఎదుర్కునే స్థాయి అనుభవం వస్తుందో రాదో చూడాలి మరి.