శాసనసభ ప్రత్యేక సమావేశం సందర్భంగా జరిగిన టిడిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగంలో నిర్వేదం నిరసన కూడా తొంగిచూస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ప్రవర్తన బాగాలేదని విమర్శించడం మామూలే. వారు మారే అవకాశం లేదని కూడా చెప్పారు. దేన్ని వ్యతిరేకించాలో దేన్ని బలపర్చాలో వారికి తెలియదన్నారు. అయితే మరోవైపున తమ పార్టీ నాయకులపై అంతకంటే తీవ్రమైన విమర్శలు చేశారు. మూస ధోరణికి అలవాటు పడిపోవడం వల్ల పరిస్థితికి తగినట్టు స్పందించలేకపోతున్నారని సూటిగానే చెప్పేశారు. హౌదాలు పదవులు ఇచ్చింది పనిచేయడానికేనని గుర్తు చేశారు.ప్రజలు ఓట్టేయకపోతే ఇవేవీ వుండవని కూడా కుండబద్దలు కొట్టి చెప్పారు. అమరావతి స్టార్టప్ వేడుకలో ఎన్నికల నాటికి ఎంతో కొంత చూపించాలని సింగపూర్ మంత్రిని కోరినప్పుడు కూడా ఇలాటి అభద్రతే కనిపించింది. ముఖ్యమంత్రి మాటలకు మంత్రులు ఎంఎల్ఎలు ఒకింత చకితులైనట్టు క్లిప్పింగ్స్ చూస్తే తెలుస్తున్నది. మరి హౌరాహౌరీ పోరాట మధ్యంలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? వైసీపీతో బిజెపి పొత్తు పెట్టుకోవచ్చన్న వూహాగానాలు ఆయనపై ప్రభావం చూపిస్తున్నాయా? నిరంతర సర్వేలు అంత అనుకూలంగా రావడం లేదు గనకే ఇలా విసుక్కుంటున్నారని కొందరు సన్నిహితుల కథనం.