వస్తు, సేవల పన్ను దేశమంతా ముక్తకంఠంతో ఆమోదిస్తున్న బిల్లు. చెడుపనికి ఎంత తీవ్రంగా ప్రతిఘటన ఉంటుందో..మంచి పనికీ ఎంతో కొంత మొరాయింపు ఉంటుంది. అది కొందరి స్వార్థం వల్ల ఏర్పడింది. జిఎస్టీ బిల్లు ఆమోదంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఒకే రకంగా వ్యవహరించాయి. అసెంబ్లీలో గందరగోళాన్ని సృష్టించాయి. ఫలితంగా విస్తృతంగా జరగాల్సిన చర్చకు తావు లేకుండా గంటలోపే బిల్లును ఆమోదించేసి, అసెంబ్లీని వాయిదా వేసేసి వెళ్ళిపోయారు. ప్రతిపక్షాలు అడుగుతున్నట్లు రైతు సమస్య కూడా ముఖ్యమే. అత్యంత ప్రధానమైనదే. అయినంత మాత్రాన అజెండాలో లేని అంశాన్ని ప్రస్తావించి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేయాలని చూసే ప్రయత్నం దేనికి సంకేతం. ఊరికే నవ్వితే.. వారి పళ్ళే బయటపడినట్లు ప్రతిపక్షమే ఇక్కడ చులకనై పోయింది.
జిఎస్టీ బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపుంటే బాగుండేది. అందుకోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల కడగండ్లను ప్రస్తావించి, ఏపీ ప్రతిపక్షం ప్రస్తావించింది. అందుకు బదులు రైతు సమస్యలపై చర్చకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసుంటే హుందాగా ఉండుండేది. ఏమాటకామాట చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే పాపమంటారు. ఏ సమావేశాన్ని ప్రతిపక్షం హుందాగా సాగనిచ్చింది. ఎక్కడ తనకు పట్టు కోల్పోతుందో.. ఎక్కడ తాము సమాధానం చెప్పుకోలేకపోతున్నామో అనే అనుమానం వచ్చినప్పుడు అసందర్భ చెళుకులు విసురుతూ, ముఖ్యమంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశమూ అందుకు మినహాయింపు కాదు. ఇలాగని అధికార పక్షం పద్ధతి ప్రకారం నడుస్తోందనుకుంటే అంతకు మించిన దోషముండదు. ప్రతిపక్ష నేత బలహీనతలను అన్నీ తెలిసిన, రాజకీయ దురంధరుడు చంద్రబాబునాయడు సమయానుకూలంగా వాటిని తన మంత్రివర్గ సహచరులతోనూ, ఎమ్మెల్యేలతోనూ వెల్లడింపచేస్తూ ఆయన్ను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇందుకు అసెంబ్లీలో బీజేపీ పక్షనేత విష్ణుకుమారరాజు వంతపాడుతుంటారు.
మొత్తం మీద ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహాసం చేస్తూ ఎవరికి వారు వ్యవహరిస్తున్నారు. నిజానికి ఏ సమస్యపై ఏపీ అసెంబ్లీలో సానుకూల వాతావరణంలో చర్చ జరిగిందో అధికార, విపక్ష నేతలు గుండెలపై చేయివేసుకుని చెప్పాలి. అసెంబ్లీ ప్రజా సమస్యలను తీర్చే వేదికగా కాక, కొత్త సమస్యలకు ఆలవాలంగా మార్చేస్తున్నారు. రెచ్చగొడితే రెచ్చిపోగూడదనీ, సంయమనంతో సాధించాలనీ ప్రతిపక్షనేత తెలుసుకుంటే మేలు. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానితో జిఎస్టీ బిల్లుకు సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చే ఉంటుంది. అప్పుడేం చెప్పారో తెలీదు గానీ.. నిన్నటి సమావేశంలో మాత్రం రచ్చచేశారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్షనేతగా అనుభవముందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుపదుల వయసులో ఉన్న ప్రతిపక్షనేతతో చాకచక్యంగా వ్యవహరించి, దారిలో పెట్టుకోవాల్సింది పోయి.. రెచ్చగొట్టి మరింత జటిలం చేస్తున్నారు. చూడబోతే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పడు వైయస్ఆర్ తనపై విసిరిన వ్యంగ్యబాణాలను పదేపదే గుర్తుకుతెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో వైయస్ జగన్ కూడా చంద్రబాబు పెద్దరికానికి గౌరవమివ్వాలి. తప్పొప్పులను ఎత్తిచూపడంలో పద్ధతిని పాటించాలి. ఇక్కడే దారితప్పుతున్నారనిపిస్తోంది.
ఈ సందర్భంలో భారత పార్లమెంటులో జరిగిన ఓ సంఘటన గుర్తుచేసుకోదగ్గది. 1974ప్రాంతంలో మధుదండావతే ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. ఏదో సమస్యపై ఆమె మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష సభ్యుల వ్యాఖ్యలకు ఆమె మొఖం కోపంతో ఎర్రబడింది. ఆగ్రహ జ్వాలల్ని కక్కింది. అది చూసి, అంతా వణికిపోయారు. ఏమవుతుందోనని భయపడ్డారు. ఈలోగా మధుదండావతే లేచి, మేడమ్.. మీరు కోపంలో కూడా ఎంతో అందంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సహజమైన మీ అందం ద్విగుణీకృతమైందని ఆయన అనగానే సభ్యులు బిత్తరపోయారు. మేడమ్ ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని భీతిల్లారు. ఊపిరిబిగపట్టి చూస్తున్న సభ్యుల్ని చూస్తూ ఇందిర పకాలున నవ్వేశారు. అంతే అప్పటివరకూ సభలో రాజ్యమేలిన ఉద్రిక్తత దూదిపింజలా ఎగిరిపోయింది. ఇందిర నవ్వు చూసి, కోపంలో కంటే.. ఇప్పుడింకా అందంగా ఉన్నారని మధుదండావతే మళ్ళీ వ్యాఖ్యానించారు. నిజానికి ఈ వ్యాఖ్యల్ని ఆమె సీరియస్గా తీసుకుని ఉంటే ఏం జరిగేది? ఆమె అలా ఆలోచించలేదు కాబట్టే హుందాతనం నిలిచింది. సభ సజావుగా సాగింది. సభను చాకచక్యంగా నడపడానికి కొంత సమయస్ఫూర్తి రెండు పక్షాలకూ ఉండాలి. కాందటారా! ఇకనైన ప్రజా సమస్యలకూ, రైతుల ఇబ్బందులకూ ప్రాధాన్యత ఇస్తే మేలు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి