2009 ఎన్నికలకు ముందు నుంచీ కూడా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ వల్ల ప్రజలకు ఏ మేరకు ప్రయోజనం ఒనగూరింది అనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ రాజకీయ ప్రసంగాల విషయంలో మాత్రం పవన్ కొంత ప్రావీణ్యం సంపాదించాడని విమర్శకులు కూడా ఒప్పుకుంటారు. చంద్రబాబును అస్సలు నొప్పించకుండా ప్రభుత్వంపైన విమర్శలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. అలాగే తనని తాను ఒక మేధావిగా, నిజాయితీపరుడుగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో కూడా బాగా సక్సెస్ అయ్యాడు. ఆ మధ్య ఓ సారి రోజూ పది పదిహేను గంటల పాటు ప్రజా సమస్యలపై, రాజకీయ విషయాలపై, అంతర్జాతీయ విషయాలపై అధ్యయనం చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు పవన్. ఇక సినిమా మేకింగ్ విజువల్స్‌లో కూడా పుస్తకం చదువుకుంటూ కూర్చుని ఉన్న పవన్ విజువల్ ఒకటి మస్ట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అభిమానులకు ఆ మాత్రం మెటీరియల్ చాలు. పవన్ కళ్యాణ్‌కి పుస్తకపఠనం అంటే ప్రాణం. ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయితేనేమీ ప్రపంచ జ్ఞానం అపారం అని చెప్పి పవన్ ప్రచారానికి మరికాస్త మసాలా జోడించారు. రైతు బాంధవుడినని జగన్, అవినీతి అంటని నిప్పునని చంద్రబాబు ఇమేజ్ ఏర్పరుచుకున్నట్టుగానే పవన్ కూడా తనదైన స్టైల్లో ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు.
ఇమేజ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో…ఆ ఇమేజ్‌ని మెయింటైన్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం అన్న విషయం పవన్‌కి తెలియనిది కాదు. అయినప్పటికీ తాజాగా చేసిన తప్పులతో అడ్డంగా దొరికిపోయాడు. యాంటీ ఫ్యాన్స్‌తో పాటు, రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఛాన్స్ ఇచ్చేశాడు. అది కూడా బల్బ్ ఎవరు కనిపెట్టారు అనే వెరీ బేసిక్ విషయం కూడా పవన్‌కి తెలియదన్న విషయం ప్రూవ్ అవడంతో కామెడీ అయిపోతున్నాడు పవర్ స్టార్. అసలే జలీల్ ఖాన్ బికాంలో ఫిజిక్స్, లోకేష్ కామెడీ నేపథ్యంలో ఇప్పుడు పవన్ పేల్చిన మేధావి కామెడీతో నెటిజనులు జోకుల మీద జోకులు పేల్చుతున్నారు. అయినా ప్రిపేర్ అయ్యి వచ్చే ప్రసంగాల్లో కూడా తప్పులు ఎందుకు దొర్లుతున్నాయో మరి. మేధావిని అని ఇమేజ్ తెచ్చుకోవడం వరకూ బ్రహ్మాండం. ప్రత్యేక ప్యాకేజ్ గురించి గంటలు గంటలు అధ్యయనం చేశా, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉంటా లాంటి డైలాగులతో జ్ఙాన సంపన్నుడిగా పేరు తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. ఆ వచ్చిన పేరును నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఇకపై అయినా ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలాంటి మాటల తప్పులు ఈ పొలిటికల్ స్టార్ నోటి వెంట రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే నెట్టింట్లో పేలుతున్న జోకులతో పవన్ ఎంత ఫీలవుతాడో తెలియదు కానీ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం సహించలేకపోతున్నారు మరి.