నాగార్జున నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడు బాధ్యతల్ని స్వీకరించాడు చిరంజీవి. వ్యాఖ్యాతగా తొలుత కాస్త తడబడినా.. ఆ తరవాత లైన్లోకి వచ్చేశాడు. చాలామంది సెలబ్రెటీల్ని షోకి తీసుకొచ్చాడు. అయితే… రేటింగులు మాత్రం దారుణంగా ఉంటున్నాయి. ఎంటర్టైన్మెంట్ మార్గాలు ఎక్కువైపోవడమో, లేదంటే అసలు ఇలాంటి రియాలిటీ షోలపై నమ్మకం తగ్గిపోవడమో… కారణం తెలీదు గానీ, మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ఆదరణ తగ్గుతూ వస్తోంది. కొన్ని వారాలుగా రేటింగు మరీ దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది. దాంతో చిరుని తప్పించి.. మరో స్టార్ చేతిలో షో బాధ్యతలు అప్పగించాలని స్టార్ టీవీ ఫిక్సయ్యిందన్న వార్తలు జోరందుకొన్నాయి. వీటిపై `స్టార్ మా` కూడా స్పందించింది. `చిరుని తప్పించాలని అనుకోవడం లేదు. ఆయన గొప్ప స్టార్. నాగార్జున ఎంత చక్కగా ఈ షోని నడిపించారో, చిరు కూడా అంతే సమర్థంగా నడిపిస్తున్నారు. రేటింగులకూ కొదవ లేదు` అంటూ కవరింగు ఇచ్చుకొంటోంది.
అయితే.. చిరు మాత్రం ఈ షోలో కొనసాగడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. తనకు తానుగానే ఈ షో నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడట. అతి త్వరలో 151వ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈలోగా వీలైనన్ని ఎపిసోడ్లు పూర్తి చేసి, గౌరవంగా తప్పుకోవాలని చూస్తున్నాడు చిరు. అటు స్టార్ మా కూడా చిరు తప్పుకొంటే ఈ కార్యక్రమానికి శుభం కార్డు వేసేయాలని భావిస్తోందట. అమితాబ్ ప్రయోక్తగా వ్యవహరించిన కౌన్ బనేగా కరోడ్ పతి సూపర్ హిట్ అయ్యింది. ప్రాంతీయ భాషల్లో మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు. నాగ్ ఎంతో కొంత నయం. ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించగలిగాడు. చిరు ఫ్లాప్ షోతో తెలుగులో ఎంఈకేకి పుల్ స్టాప్ పడబోతోందిప్పుడు.