కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29వ తేదీతో ముగుస్తుంది. కనుక వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించినట్లయితే నవంబర్ మొదటి వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. తాజా సమాచారం ప్రకారం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల మొదటి వారం నుండి మొదలుపెట్టి మొత్తం ఐదు దశలలో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మూడు నాలుగు నెలల క్రితం నుండే బీహార్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలలో గెలిచేందుకు కసరత్తు, ప్రచారం ఆరంభించేసాయి. ఈరోజు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని రోజుల క్రితమే బీహార్ రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ తాయిలం ప్రకటించేశారు. ఈ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి బీహార్ లో అధికార పగ్గాలు చెప్పట్టాలని బీజేపీ పట్టుదలగా ప్రయత్నాలు చేస్తుండటంతో దానిని ఎదుర్కొనేందుకు 6 పార్టీలు కలిసి జనతా పరివార్ ఏర్పాటు చేసుకొన్నాయి. కానీ నాలుగు రోజుల క్రితం దాని అధ్యక్షుడు ములాయం సింగ్ జనతా పరివార్ ని విడిచి పెట్టేసారు. తమ (సమాజ్ వాదీ) పార్టీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో జనతా పరివార్ కి మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. ఇంతవరకు విడివిడిగా పోటీచేస్తున్న వామ పక్షాలన్నీ కలిసి వామ పక్ష కూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి. జనతా పరివార్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలకు వామపక్ష కూటమి సవాలుగా మారింది.